ఇమ్రాన్‌ పార్టీ ముందంజ

Feb 10,2024 10:48 #Imran Khan, #leading, #party
  • పాక్‌ ఎన్నికల ఫలితాలు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ అన్యూహమైన విజయాలను సాఢించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ జైలులో ఉండడం…ఎన్నికల్లో పోటీకి ఆయనను అనర్హుడిగా ప్రకటించడం,.. ఆ పార్టీ ఎన్నికల గుర్తును రద్దు చేయడం.. ప్రచారం కూడా సరిగా చేసుకోనివ్వకపోవడం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ పార్టీ ఇతర ప్రధాన పార్టీలను వెనక్కు నెట్టి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ప్రజాస్వామ్యం పట్ల పాక్‌ ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షకు ఇదొక నిదర్శనం. 265 స్థానాలకు నేరుగా జరిగిన ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఇంతవరకు 217 సీట్ల ఫలితాలను ప్రకటించారు. ఇందులోపిటిఐ మద్దతుతో పోటి చేసిన  ఇండిపెండెంట్లు 88 సీట్లు గెలుచుకున్నారు. ప్రధాన పార్టీలైన పిఎంఎల్‌-ఎన- 61, పిపిపి- 50 స్థానాలతో ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిలిచాయి. ఇతర చిన్న పార్టీలకు 18సీట్లు లభించాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోయిన కారణంగా ఎన్నిక వాయిదా పడింది. మరో 48సీట్లకు ఫలితాలు ప్రకటించాల్సి వుంది. 265 స్థానాలున్న పాక్‌ పార్లమెంటులో సాధారణ మెజార్టీ లభించాలంటే 133 స్థానాలు కావాలి. మహిళలు, మైనార్టీల రిజర్వుడు స్థానాలు అన్నీ కలిపితే మొత్తం 336 స్థానాలకు గాను సాధారణ మెజార్టీ సాధించాలంటే 169 స్థానాలు అవసరం. ఫలితాల ప్రస్తుత సరళిని బట్టి చూస్తే హంగ్‌ పార్లమెంటు ఏర్పడే అవకాశముంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌, ఖైబర్‌ ఫక్త్వూన్‌ అసెంబ్లీల్లో పిటిఐ, సింద్‌లో పిపిపి అధిక్యంలో ఉన్నాయి. ప్రధాన రాజకీయ నాయకులందరూ ఈ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కారు.

➡️