ఆకట్టుకున్న నంది నాటకోత్సవాలు

  • మూడో రోజూ భారీగా ప్రేక్షకులు

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర చలనచిత్ర టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు సోమవారం మూడోరోజు ఉల్లాసంగా జరిగాయి. గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న ఈ నంది నాటకోత్సవాలు ఉదయం నుంచి రాత్రి వరకూ పలు కార్యక్రమాలు ప్రదర్శితమయ్యాయి. నాటకాలను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు.

మూడోవరోజు ప్రదర్శనలలో విజయవాడ శ్రీ రామ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ వారి మంచి (గుణ) పాఠం బాలల నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను డాక్టర్‌ పివిఎన్‌ కృష్ణ రచించగా పి సాయిశంకర్‌ దర్శకత్వం వహించారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల కార్మిక వ్యవస్థను రూపు మాపలేక పోవడం విచారకరమని, దానికి ఏంచేస్తే బాలలందరికీ ఉజ్వల భవిత దక్కుతుందో అనే విషయంపై పాఠశాల విద్యార్థులు చక్కగా నటించారు. వీరికి రూ.25 వేల పారితోషికం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైౖర్మన్‌ పోసాని కృష్ణ మురళి అందజేశారు.

తెనాలి వారు ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ భాజే ” సాంఘిక నాటకం ప్రదర్శించారు. బండల పక్కన ఏరు .ఏరు పక్కనే ఊరు. ఊరుకొక్క పోరు అంటూ పోరాటాలు, ఆరాటాలు వీటన్నిటి నేపథ్యంలో ప్రపంచానికి పోరాటం నేర్పిన కళాకారుడి పరిస్థితి తనదాకా వస్తే ఎలావుంటుందన్న విషయాన్ని ఈ నాటికలో చూపించింది. ఎంఎస్‌ చౌదరి రచన దర్శకత్వాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కళా బృందానికి రూ.40 వేలు, మెమెంటో, ప్రశంసపత్రాలను అందజేశారు. విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఇది ‘దిశ’ యధార్థ కథ ఆధారంగా రూపొందిన నాటిక. సవేరా ఆర్ట్స్‌ సంగీత సాహిత్య నాటక సంస్థ కడప వారు సమర్పించిన ‘శ్రీరామ పాదుకలు’ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. రామాయణం పాదుకా పట్టాభిషేక ఘట్టం ఈ నాటక ప్రధాన ఇతివృత్తం.

➡️