చిలకలూరిపేటలో దళితుల భూముల ఆక్రమణ

Dec 21,2023 10:48 #palnadu district
illegal mining in chilakaluri peta
  • బాధితులను చంపుతామని బెదిరిస్తున్న ఆక్రమణదారులు

ప్రజాశక్తి-చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల చెరువుకు వెళ్లే దారిలో బుధవారం ఉదయం ఉన్నటువంటి నూతనంగా హైవే నిర్మిస్తున్న దాని పక్కన ఉన్న చిలకలూరిపేట పట్టణంలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందినటువంటి బండారు యాకోబు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాదాపు రెండు ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో పొలానికి సంబంధించిన దళితులు న్యాయ పోరాటంలో భాగంగా కోర్టుకు వెళ్లడం జరిగినది. ఇదే విషయమై సంబంధించిన హక్కుదారులు స్పందనలో భాగంగా జిల్లా ఎస్పీ, నరసరావుపేట డిఎస్పి లకు ఫిర్యాదు చేయడం కూడా జరిగినది. అయితే పొలానికి సంబంధించిన విషయం కోర్టులో ప్రస్తుతం నడుస్తోంది. కొంతమంది వ్యక్తులు తమను బెదిరించి, అన్యాయంగా మేము సాగు చేసుకుంటున్న పంట పొలంలో క్రేన్లు పెట్టి లారీలతో మట్టి తోలిస్తున్నారు అని బాధితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకులకు సమాచారం అందించగా వారు ఆ పొలం దగ్గరకు వెళ్లడం జరిగినది. పొలానికి సంబంధించిన విషయం కోర్టులో కేసు జరుగుతుంటే మధ్యలో ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్ళకూడదు కదా అని దళిత సంఘం నాయకులు ప్రశ్నించారు. అయితే ఆక్రమించుకుంటున్న ఆక్రమణదారులు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి బాధితులపై దౌర్జన్యానికి దిగడం జరిగినది. కులం పేరుతో దూషిస్తూ, మాకు అన్ని విధాలుగా బలం ఉంది, అలాగే మాకు రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి. మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. ఆక్రమణదారులు వేసే చిల్లర రూపాయలకు కక్కుర్తి పడే కొంతమంది వ్యక్తులు అగ్రవర్ణ ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ అసత్యాలను అబద్దాలను వారికి వారే కట్టు కథలుగా అల్లుకొని బాధితులపై మాటలతో ఎదురుదాడికి దిగటం జరిగినది. ఒకానొక సందర్భంలో విషయం తెలుసుకుని గొడవ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేయడం జరిగినది. కాబట్టి పట్టణ పోలీసులు, అలాగే రెవెన్యూ అధికారులు, చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ అధికారులు ఆక్రమణకు గురవుతున్న పంట పొలాన్ని పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. న్యాయం జరగకపోతే దళిత, బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని బాధితులు తెలిపారు.

➡️