ఎల్‌ఐసిలో ఐపిఒను ఉపసంహరించుకోవాలి

Jan 29,2024 20:47 #Lic, #meetings
  •  ఎల్‌ఐసి ఎఒఐ విశాఖ డివిజన్‌ సమావేశంలో మంజునాథ్‌

ప్రజాశక్తి – కలెక్టరేట్‌, సీతమ్మధార (విశాఖపట్నం) : ఎల్‌ఐసిలో ఐపిఒను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాలసీలపై జిఎస్‌టిని రద్దు చేయాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసి ఎఒఐ) జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంజునాథ్‌ డిమాండ్‌ చేశారు. విశాఖలోని అంబేద్కర్‌ భవనంలో సోమవారం ఎల్‌ఐసి ఎఒఐ విశాఖ డివిజన్‌ ఐదో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంజునాథ్‌ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐపిఒకి అనుమతించిందని విమర్శించారు. ఎల్‌ఐసి ప్రజల ఆస్తి అని, దీనిని ప్రయివేటుపరం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఎల్‌ఐసిలో 32 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని, వారి ప్రయోజనాలను కాపాడడం కోసం తమ సంఘం పోరాడుతోందని తెలిపారు. ఐఆర్‌డిఎఐ ప్రవేశపెట్టిన పాలసీల వల్ల ఖాతాదారులకు, ఏజెన్సీలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఏజెంట్స్‌కు నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేయనున్నామన్నారు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా ఎల్‌ఐసి ఎఒఐ సౌత్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి పిఎల్‌ నర్సింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్‌, రాజమండ్రి డివిజన్‌ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఐసియుఇ విశాఖ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి వరప్రసాద్‌ హాజరయ్యారు. సమావేశానికి ముందు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యదర్శి నివేదికపై చర్చించారు. ఈ సమావేశానికి 20 బ్రాంచుల నుంచి 400 ప్రతినిధులు హాజరయ్యారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

సమావేశంలో 146 మందితో నూతన కౌన్సిల్‌ను, 72 మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, అధ్యక్షులుగా ఎం.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ట్రెజరర్‌గా కె.త్రిమూర్తులు ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా ఆంజనేయులు, సత్తార్‌, ధనుంజరు, రామకృష్ణ, శ్రీరాములుతో పాటు 23 మందిని ఆఫీస్‌ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

➡️