వైసిపి హయాంలోనే ‘అనంత’ అభివృద్ధి

వైసిపి హయాంలోనే 'అనంత' అభివృద్ధి

మహిళతో మాట్లాడుతున్న వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 3వ డివిజన్‌లో ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోఉ భాగంగా4 ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో రూ.1045 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. అయితే మొన్న అనంతపురానికి వచ్చిన సినీనటుడు బాలకృష్ణ అభివృద్ధి పనుల విషయంలో అర్థపర్థం లేని మాటలు మాట్లాడటం బాధాకరమన్నారు. అనంతలో అభివృద్ధి లేదని చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇదే అనంతపురంలోనే బ్రిడ్జి, నాలుగు లైన్ల రోడ్డు ఆయనకు కనిపించలేదా.. అని ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవ, కేంద్రం సహకారానికి తోడు తాను ఎంపీగా పని చేసిన సమయంలో ఉన్న పరిచయాలతో పనులు మంజూరు చేయించుకున్నామన్నారు. రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించామని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును బాలకృష్ణ చదివారని విమర్శించారు. సినిమాల్లో లాగే రాజకీయాల్లోనూ బాలకృష్ణ నటిస్తున్నారన్నారు. హిందూపురంలో తండ్రి ఎన్టీఆర్‌ చరిష్మా, సినీ గ్లామర్‌ వల్లే ఆయన గెలుస్తున్నాడు తప్ప.. అక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అనంతపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, వారి ఆశీస్సులతో మరోసారి గతం కంటే అధిక మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, టిటిడి బోర్డు సభ్యులు అశ్వర్థనాయక్‌, నాయకులు రాగే పరుశురాం, చింతా సోమశేఖరరెడ్డి, రమేష్‌గౌడ్‌, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, వెన్నం శివారెడ్డి, శ్రీదేవి, మార్కెట్‌ యార్డు వైస్‌ఛైర్మన్‌ ఓబిరెడి జిల్లా కార్యదర్శి గోపాల్‌మోహన్‌, యువజన విభాగం నగర అధ్యక్షుడు వాసగిరి నాగ్‌, స్థానిక కార్పొరేటర్‌ అంకే కుమారమ్మ, కార్పొరేటర్లు బండి నాగమణి, ఎం దేవి, హసీనా బేగం, లావణ్య, లీలావతి, రాజేశ్వరి, అబుసులేహా, లాలూ, బాలాంజినేయులు, సంపంగి రామాంజనేయులు, నరసింహులు, కమల్‌భూషణ్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, వైసీపీ నేతలు కృష్ణమూర్తి, సురేష్‌, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

➡️