Isis ఉగ్రవాద సంస్థలో చేరతానన్న ఐఐటి గువహతి విద్యార్థిని అరెస్టు

గువహతి : ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్‌ మీడియాలో ప్రకటించడంతోపాటు ఈ మెయిల్స్‌ చేసిన ఐఐటి గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆచూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్‌ జిల్లాలో అతడిని పట్టుకున్నారు.

ఐసిస్‌ ఇండియా చీఫ్‌ హరిస్‌ ఫరూకీ అలియాస్‌ హరీష్‌ అజ్మల్‌ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్‌ సింగ్‌ అలియాస్‌ రెహాన్‌ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆచూకీని పోలీసులు కనుగొనడం విశేషం. అస్సాం పోలీసులు మాట్లాడుతూ … విద్యార్థి పంపిన మెయిల్స్‌ నిజమైనవేనని ధ్రువీకరించుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. ట్రావెలింగ్‌లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నామన్నారు. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించామని తెలిపారు. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఐసిస్‌ నల్ల జెండాతో పాటు ఐసిస్‌ మనుస్క్రిప్ట్‌ విద్యార్థి హాస్టల్‌ రూమ్‌లో దొరికిందన్నారు. విద్యార్థి ఢిల్లీలోని ఓక్లాకు చెందినవాడు అని వివరించారు.

➡️