మంత్రి మాటలు బేఖాతరు .. తాళాలు పగలకొట్టడం మానని అధికారులు

  • పలుచోట్ల ప్రతిఘటన
  • కేసులు పెట్టిన అంగన్‌వాడీలు
  • నాల్గవరోజూ కొనసాగిన ఆందోళనలు

ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె నాల్గో రోజూ కొనసాగింది. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలపై సర్వతా నిరసన వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టే చర్యలను అధికారులు శనివారం కూడా కొనసాగించారు. దీనికి ఎక్కడికక్కడ ప్రతిఘటన ఎదురైంది. దీంతో, పలు ప్రాంతాల్లో అధికారులు వెనుదిరి గారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం చెప్పలేదని అంగన్‌వాడీ యూనియన్లతో చర్చల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరి స్తున్నారు. దీనిపై అంగన్‌వాడీలు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు తగులగొట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. మంత్రి ప్రకటనలో నిజమే ఉంటే చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎందుకు వెనుకాడు తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామ సచివాలయ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచినా తమ పిల్లలను తల్లిదండ్రులు ఎవరూ పంపలేదు. సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రజలు కోరుతున్నారు. అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో అందోళన కొనసాగించారు. వినూత్న రీతుల్లో నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరం వద్ద రోడ్డుపై బైటాయించి అమ్మోరుతల్లి వేషధారణలో నోట్లో వేపాకు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లి అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టేందుకు వెళ్లిన సచివాలయం మహిళా పోలీస్‌ రేఖారాణికి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో, చేసేదిలేక కేంద్రం వద్ద చిన్న గది వద్దకు వెళ్లి తలుపులు తీసినట్లు ఫొటో తీసుకొని మహిళా పోలీసు వెనుదిరిగారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట గ్రామం లోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతుండగా స్థాని కులు, సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. గంపలగూడెం మండలం పెనుగొలనులోని మధ్య అంగన్‌వాడీ కేంద్రం తాళాన్ని అధికారులు పగలగొట్టారు. ఈ విషయం తెలిసి తిరువూరులో తహశీల్దార్‌ కార్యాలయం ముందు జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్త కె.లింగమ్మ స్పహ కోల్పోయారు. ఆమెను సహచర కార్యకర్తలు, సిఐటియు నాయకులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్‌ పరిధిలోని 221 నెంబర్‌ అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొడుతున్న సచివాలయ సెక్రటరీ అధికారులను ఐద్వా పశ్చిమ సిటీ అధ్యక్షులు కుండనాల శేషుమణి ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అన్నమయ్య జిల్లా రాయ చోటిలో బంగ్లా సర్కిల్‌ వద్ద గంటన్నరసేపు మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో, కడప, పీలేరు, రాయచోటి బస్టాండ్‌ మూడు వైపులా సుమారు రెండు కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

లోకేష్‌ సంఘీభావం

అనకాపల్లి జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మునగపాక లోని అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు శిబిరంలో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. మరో మూడు నెలల్లో టిడిపి ప్రభుత్వం రాబోతుందని, అంగన్‌వాడీలకు పక్క రాష్ట్రంలో ఉన్న వేతనాలు ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

స్వీకర్‌కు వినతి

శ్రీకాకుళం జిల్లా పొందూరులో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను అంగన్‌వాడీలు కలిసి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు సమ్మె శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తోన్న అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీల సమ్మెకు ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట కొనసాగుతున్న సమ్మె శిబిరంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. పొన్నూరులో అంగన్‌వాడీ దీక్షా శిబిరాన్ని మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారి డాక్టర్‌ టి.రాజారావు, తెనాలిలో బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేటలో ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిష్టీ, చిలకలూరిపేటలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు.

అంగన్‌వాడీ బాధ్యతలు మాకొద్దు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇప్పటికే పనిభారంతో ఇబ్బంది పడుతున్న తమపై అంగన్‌ వాడీ కార్యాలయాల నిర్వహణ బాధ్యతలు కూడా మోపపవద్దని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్ష, కార్యదర్శులు కె.అనూరాధ, ఎం.గురుస్వామి శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే బిఎల్‌ఓ డ్యూటీ లతో ఇబ్బంది పడుతున్నారని, అధికారుల వత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగాలకు రాజీనామా కూడా చేసి వెళ్తున్నారని తెలిపారు. దీనికితోడు అంగన్‌వాడీ కార్యాలయాల నిర్వహణ చూడా లనడం మరింత భారమవుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగల కొట్టి, నిర్వహణ బాధ్యతలు చూడా లంటూ అధికారులు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల తో క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయాల్సిన అంగన్‌వాడీ, సచివాలయ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.ఈ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య కోరింది.

ప్రభుత్వ నిరంకుశ చర్యలు ఆపాలి : మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడి ఉద్యోగులకు జీతాలు పెంపు, గ్రాట్యూటీ వంటి న్యాయమైన సమస్యలను పరిష్క రించకుండా మొండి వైఖరి అవలంభిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరంకుశ చర్యలు ఆపాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేష న్‌(సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, ప్రధాన కార్యదర్శి కె ఉమమహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడి కేంద్రాల తలుపులు బద్దలు కొట్టడాన్ని సచివాలయాల సిబ్బందితో తెరిపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలుజీతం పెంచుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్మరించడం భావ్యం కాదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నాలుగేళ్లుగా అంగన్‌వాడీలు అందోళన చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడి ఉద్యోగుల పోరాటానికి అండగా మున్సిపల్‌ కార్మికులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

➡️