ప్రభుత్వ బడుల్లో ఐబి విద్య 

Feb 1,2024 07:40 #AP Education, #CM YS Jagan
IB education in govt schools

ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబి) సిలబస్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎపి రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎపిఎస్‌సిఇఆర్‌టి), ఐబి మధ్య ఒప్పందం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఐబితో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తనకు గొప్ప సంతృప్తినిస్తోందని అన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఇప్పుడున్న విద్యా విధానాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐబి డైరెక్టర్‌ జనరల్‌ ఒల్లి పెక్కా హీనోనెన్‌ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంపై తాము చాలా నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఎపిలో కొత్త తరహా విద్యా విధానంతో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️