ఎమ్మెల్యే రేసులో ఐఏఎస్ అధికారి

Feb 28,2024 17:28 #ap assembly, #Kurnool, #ycp mla
IAS officer in MLA race

కొనసాగుతున్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నం

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధిష్టానం రోజుకో ట్విస్ట్ ను ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే సీటు విషయంలో అధిష్టానం తలమునుకలవుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వైసిపి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిత్వాన్ని ఎంపిక చేయడం పట్ల సుదీర్ఘ ఆలోచనను అధిష్టానం చేస్తూ వస్తుంది. ఎమ్మెల్యే సీట్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ మొదటినుంచి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా కోవిడ్ లాంటి అనేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తూ వైద్య సహాయ సహకారాలు సేవలు అందించారు. తనకంటూ ఓ ప్రత్యేక క్యాడర్ను 20 మంది కార్పొరేటర్ లను గెలిపించుకొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ముందుకు సాగారు. ఇక కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తనకే అన్న ధీమాతో ఆయన ఉండగా అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం ప్రకటిస్తూ ట్విస్ట్ ని ఇచ్చింది. కర్నూలు నగరంలో ఆయనకు టికెట్ ఇస్తే అదే పార్టీలో మరో వర్గంగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి, మరి కొంతమంది పార్టీ నాయకులు సహకరించే పరిస్థితి లేదన్న ఆలోచనతో అధిష్టానం అతని పక్కన పెట్టినట్లు సమాచారం. పార్టీ అవసరాల రీత్యా ఆయనకు రాజ్యసభ సీటును కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వృత్తిరీత్యా వైద్యుడిగా పనిచేసే డాక్టర్ ఇలియాస్ ను ఓ మంత్రి తెర వెనుక నుంచి పార్టీకి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇలియాస్ ప్రొఫైల్ ను పరిశీలించిన అధిష్టానం ఆయన సీటును దాదాపు ఓకే చేసిందన్న అభిప్రాయం పార్టీ కేడర్ నుంచి గట్టిగా వినిపించింది. ఈ విషయం బయటకు వచ్చిన రెండు రోజుల్లోనే పార్టీ అధిష్టానం మరో కొత్త ట్విస్టును ముందుకు తెచ్చింది. డాక్టర్ ఇలియాస్ భాషకు బదులుగా కర్నూలు నగరానికి చెందిన కీర్తిశేషులైన పేదల డాక్టర్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఇస్మాయిల్ అల్లుడు ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ పేరును పరిశీలించి ముందుకు తెచ్చింది. కర్నూలు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వంలోని సెర్ఫ్, మైనార్టీ వెల్ఫేర్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపో మాపో తన బాధ్యతలకు రాజీనామా చేసి అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ తన పోరాటాన్ని కొనసాగిస్తారా? లేక అధిష్టానం ఆదేశాలను పాటిస్తారా? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? ఈలోగా వైసిపి అధిష్టానం మరో ట్విస్ట్ కి ఏమైనా తెరలేపుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

➡️