చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు : సిఎం జగన్‌

Apr 13,2024 13:34 #ap cm jagan, #Mangalagiri, #speech

మంగళగిరి (గుంటూరు) : చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం తనకు లేదని ఎపి సిఎం జగన్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం మంగళగిరిలో జరిగింది. ఈ సందర్భంగా అక్కడి చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ …. ఎన్నికల్లో ప్రజల బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. గత చంద్రబాబు పాలనను చూశారనీ… 58 నెలల కాలంలో వైసిపి పాలనను చూశారనీ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం తనకు లేదన్నారు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970 కోట్లు చేనేత కార్మికులకు అందించామన్నారు. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చామన్నారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశామన్నారు. 1.06 లక్షల మందికి లబ్ధి జరిగిందని, గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదని సిఎం జగన్‌ చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. అందుకే ఓటు వేయాలని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయాలని ప్రజలను సిఎం జగన్‌ కోరారు.

➡️