ప్రధాని ‘క్రూరత్వం ’ బాధ కలిగించింది : రాహుల్‌ గాంధీ

Jan 1,2024 08:23 #PM Modi, #Rahul Gandhi, #Wrestlers

న్యూఢిల్లీ :   రెజ్లర్లపై ప్రధాని మోడీ క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆదివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని దేశ సంరక్షకుడని, రెజ్లర్ల పట్ల ఆయన ఈ విధంగా క్రూరత్వం చూపడం బాధ కలిగించిందని అన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ)   మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి  బ్రిజ్‌ భూషణ్‌పై    కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ రెజ్లర్‌ వినేష్‌ ఫోగాట్‌ ఖేల్‌ రత్న, అర్జున అవార్డులను కర్తవ్యపథ్‌లోని పేవ్‌మెంట్‌పై విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తన పతకాలను ప్రధానికి అందించేందుకు వినేష్‌ ఫోగాట్‌ బయలుదేరిన వీడియోను పోస్ట్‌ చేస్తూ రాహుల్‌ స్పందించారు.

‘దేశంలోని ప్రతి కూతురికి ఆత్మ గౌరవమే మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయి. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? యావత్‌ దేశానికి ప్రధానమంత్రి సంరక్షకుడు. ఆయన వైపు నుండి ఇటువంటి క్రూరత్వం చూస్తుంటే బాధ కలుగుతోంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

తనకు వచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న వినేశ్‌ ఫొగాట్‌.. వాటిని ప్రధాని మోడీకి  అందజేసేందుకు శనివారం కర్తవ్యపథ్ వెళ్లారు. అయితే పోలీసులు ఆమెను  అడ్డుకోవడంతో వాటిని కర్తవ్యపథ్‌ వద్ద వదిలేశారు.  బ్రిజ్‌భూషణ్‌  సన్నిహితుడు సంజయ్ సింగ్‌ డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వెనక్కి ఇచేస్తామని వినేష్‌ ఫోగాట్‌ గతంలో ప్రకటించారు.  రెజ్లర్లు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు  అవార్డులు, సన్మానాలు  అర్థరహతమని  పేర్కొన్నారు.

➡️