వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు కోసం రేపటి నుంచి నిరాహార దీక్షలు

Jan 5,2024 08:56 #press meet, #subbaravamma

-అంగన్‌వాడీ సంఘాలు

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె సబ్బరావమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి విఆర్‌ జ్యోతి మాట్లాడారు. డిసెంబరు 12 నుంచి జరుగుతున్న సమ్మెకు కొనసాగింపుగా శుక్రవారం రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. శనివారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు ఉంటాయని వెల్లడించారు. నిర్దిష్టమైన డిమాండ్లతో 24 రోజులుగా సమ్మె జరుగుతోందని, మంత్రుల బృందంతో గానీ, సిఎస్‌తో గానీ చర్చలు జరిగినప్పటికీ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏదీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా మారుస్తున్నామని హామీ ఇచ్చినప్పటికీ జిఓ ఇవ్వలేదని తెలిపారు. ఫేస్‌ యాప్‌ రద్దు, సంక్షేమ పథకాల అమలుపైనా ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీ ప్రధాన డిమాండ్ల కోసం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వేతనాల పెంపు ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిఐటియు అనుబంధం అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు జి బేబీరాణి, ఎన్‌సిహెచ్‌ సుప్రజ, ఎఐటియుసి అనుబంధ నాయకులు మంజుల, ఐఎఫ్‌టియు అంగన్‌వాడీ నాయకులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

➡️