ఎన్నాళ్ళీ వెట్టిచాకిరి ? 

Dec 15,2023 07:09 #Editorial

               ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో శానిటేషన్‌ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద, దళిత, గిరిజన, వర్గాల ప్రజలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక దశాబ్దాలుగా స్వీపర్లుగా, శానిటేషన్‌ (ఆయా), కంటింజెంట్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ పిల్లల ఆరోగ్యాలను కాపాడుతున్న వీరితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తున్నది. విద్యార్థులు రాక ముందే వచ్చి స్కూళ్లు, కాలేజీలు శుభ్రం చేసి విద్యాలయాలు మూసే వరకు అక్కడే ఉండాల్సి వస్తున్నది. దాదాపు ఉదయం 7.30 గంటలకు ఇంటి నుండి బయలుదేరితే సాయంత్రం 6-7 గంటలకు తిరిగి ఇంటికి చేరుతున్నారు. స్వీపర్లు, స్కావెంజర్లుగా ఫుల్‌ టైం పని చేస్తున్న వారికి వైసిపి ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో జీవో నెం.22 తీసుకొచ్చి రూ.6 వేల వేతనం ఇస్తానని చెప్పింది. కానీ అది కూడా ప్రతీ నెలా జీతాలు ఇవ్వడం లేదు. అమ్మ ఒడి పథóకం నుండి ప్రతి విద్యార్థి నుండి రూ.1000 వసూలు చేసి శానిటేషన్‌ వర్కర్లకు జీతాలు ఇస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. రెండవ దఫాలో రూ. 2 వేలు తల్లిదండ్రుల నుండి ప్రభుత్వం వసూలు చేసింది. ఆ రకంగా రెండవ విడత 107 కోట్ల రూపాయలు అమ్మఒడి పథóకం నుంచి వసూలు చేసిన నిధులు వివిధ కార్పొరేషన్ల వద్ద డిపాజిట్‌ అయి ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రతి నెలా శానిటేషన్‌ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్ళించే ప్రయత్నాలు చేసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో పని చేస్తున్న శానిటేషన్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. దాదాపుగా 54 వేల మంది శానిటేషన్‌ కార్మికులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. మున్సిపల్‌ పాఠశాలల్లో పని చేసే అట్టడుగు వర్గాలకు చెందిన పార్ట్‌ టైం కంటింజెంట్‌ వర్కర్ల సమస్యలను ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కరించటంలేదు. వీరికి నెలకు రూ.4 వేల వేతనం ఇచ్చి 8 నుండి 10 గంటలు పనిచేయించుకుంటున్నారు. పేరుకే పార్ట్‌ టైం పని. చేయించుకునేది ఫుల్‌ టైం. వీరంతా గత 25 నుండి 33 సంవత్సరాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరు 22 వేల మంది ఉన్నారు.

300 లోపు విద్యార్థులకు ఒక ఆయా, 301 నుండి 600 మంది విద్యార్థులు ఉంటేే ఇద్దరు ఆయాలు 600 నుండి 900 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఆయాలు 900 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే నలుగురు ఆయాలను పాఠశాలలో నియమించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.22లో చెబుతున్నారు. మన ఇంట్లో వాష్‌రూంలను వారంలో ఒకటి రెండు సార్లు క్లీన్‌ చేస్తాము. అలాంటిది 300 మంది విద్యార్థులకు ఒక్క ఆయా పనిచేయాలి. అంటే ఇది వెట్టిచాకిరి కాక ఏమవుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ‘స్వచ్ఛ భారత్‌’ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న టువంటి ప్రభుత్వాలకు…పాఠశాలలు, కళాశాలలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాలను పరిరక్షిస్తున్న శానిటేషన్‌ కార్మికుల సమస్యలు పట్టడం లేదు. వీరి పట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా, తమ డిమాండ్ల సాధన కోసం వారు పోరు బాట పట్టారు. వేతనాలు పెంచాలని, ప్రతి నెలా 5వ తేదీ లోపుగా వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, శానిటేషన్‌ పరికరాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉపాధి భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ వంటి సౌర్యాలు కల్పించాలని, శానిటేషన్‌ కార్మికులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర ధర్నాకు తరలిరాబోతున్నారు. అనేక దశాబ్దాలుగా వెట్టిచాకిరికి గురవుతున్న శానిటేషన్‌ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మద్దతుగా నిలవాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది.

- దయా రమాదేవి, ఎ.పి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు), సెల్‌ : 9490041456
– దయా రమాదేవి, ఎ.పి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు), సెల్‌ : 9490041456
➡️