గృహ వినిమయ వ్యయ గణాంకాలు – మోడీ ప్రభుత్వ వక్రబుద్ధి

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడటంతో ఆగమేఘాల మీద 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే నివేదికను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విడుదల చేసింది. అది కూడా పూర్తి నివేదిక కాదు. కేవలం 27 పేజీల సంక్షిప్త ‘వాస్తవ నివేదిక’ (ఫ్యాక్ట్‌ షీట్‌) పేర ప్రకటించారు. 2023-24 రెండో సర్వే ఇంకా కొనసాగుతున్నది. ఇది పూర్తయిన తరువాత రెండు సర్వేల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సంపూర్ణ నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో ఇది సాధ్యపడదు. నూతన వినియోగ ధరల సూచీని నిర్ధారించటానికి అవసరమైన ప్రాథమిక పున:పరిశీలన, మార్కెట్‌ సర్వే, వస్తువులకు తగిన వెయిటేజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంకా జరగక ముందే సంక్షిప్త నివేదికతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. తప్పుడు ప్రచారానికి పూనుకుంటూ ప్రజలను మోసగిస్తున్నది.

పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత సరేంద్ర మోడీ ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో నిర్వహించిన గృహ వినియోగ వ్యయ సర్వే గణాంకాలను విడుదల చేసింది. వాస్తవంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో ప్రజల వినిమయ స్థితిగతులను తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ శాంపిల్‌ సర్వే సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తుంది. భారతదేశంలో ఆదాయ సర్వేలు లేనందున ఈ వినిమయ గణాంకాల ద్వారానే ఆదాయ ధోరణులు తెలుసుకోవటానికి కూడా దీనిని ఉపయోగి స్తున్నారు. అంటే ఒక కుటుంబం నెలకి ఎంత ఖర్చు చేస్తుందో ఈ సంఖ్యల నుండి ఎంత ఆదాయం సంపాదిస్తున్నారో సుమారుగా అంచన వేయవచ్చు. దీనికి ముందు 2017-18 కాలంలో నిర్వహించిన గృహ వినిమయ వ్యయం సర్వేను విడుదల చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో ప్రవేశపెట్టిన జిఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవటంతో దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం పడి వారి కుటుంబ వినియోగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ వాస్తవాలు సర్వేలో నిరూపణై బహిర్గతం కావడంతో మోడీ ప్రభుత్వం భగ్గుమన్నది. దీంతో సర్వే డేటా సక్రంగా లేదనే సాకు చెప్పి సర్వే ఫలితాలను విడుదల చేయకుండా కప్పిపుచ్చేసింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 2,61,746 కుటుంబాల నుండి 2022-23 సర్వే నిర్వహించింది. ఇందులో 8723 గ్రామాల నుండి 1,50,514 కుటుంబాలు, 6115 పట్టణాల నుండి 1,06,732 కుటుంబాలు ఉన్నాయి. సర్వే వివరాలను పరిశీలిస్తే 2011-22లో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రూ.1430 ఉంటే, 2022-23 నాటికి రూ.3773కు చేరింది. పట్టణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం చూస్తే సగటు తలసరి వినియోగం రూ.2630 నుండి రూ.6459కి పెరిగింది. 2011-12 నాటి ధరల సూచీ ప్రకారం చూస్తే సగటు తలసరి వినిమయ వ్యయం గ్రామీణ ప్రాంతంలో రూ.1430 నుంచి రూ.2008కి అంటే వార్షిక వృద్ధి రేటు 4 శాతం, పట్టణ ప్రాంతాలల్లో రూ.2630 నుంచి రూ.3510కి అంటే ఏడాదికి 3 శాతం వృద్ధి రేటుగా నమోదయ్యింది.

సామాజిక తరగతుల వారీగా చూస్తే గిరిజనులలో నెలవారీ సగటు వినియోగ వ్యయం 2022-23లో గ్రామీణ ప్రాంతంలో రూ.3016, దళితుల్లో రూ.3474, ఓబిసిల్లో రూ.3848, ఇతరుల్లో రూ.1392గా ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొన్నది. అలాగే పట్టణ ప్రాంతాల్లో గిరిజనుల్లో రూ.5414, దళితుల్లో రూ.5307, ఓబిసిల్లో రూ.6177, ఇతరుల్లో రూ.7333 నెలవారీ సగటు వినిమయ వ్యయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు, దళితులు దేశ సగటు వ్యయం కంటే వారి వినిమయం చాలా తక్కువగా ఉంది, ఓబిసిల్లో సగటు కంటే కొంచెం ఎక్కువగా కన్పిస్తున్నది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే గిరిజన, దళిత, ఓబిసి మూడు తరగతులు దేశ సగటు వినిమయం కన్నా అథమ స్థితిలో ఉన్నారు. ఈ తరగతులకు అగ్ర వర్ణాలకు మధ్య వినియోగ వ్యయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది.

సర్వే నివేదిక మరొక అంశాన్ని కూడా నిర్ధారించింది. పేద-ధనికుల మధ్య వినిమయ అంతరాలను కూడా గణించింది. దేశ జనాభాలో అట్టడుగు 5శాతం నిరుపేదలు సగటున నెలకి గ్రామీణ ప్రాంతంలో రూ.1373 ఖర్చు చేస్తుంటే, అదే పైనున్న 5 శాతం ధనికులు నెలకు సగటున తలసరి రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో కింది స్థాయి పేదలు రూ.2001 ఖర్చు చేస్తుంటే పైస్థాయిలోని 5 శాతం ధనికులు నెలకి సగటున తలసరి రూ.20,824 ఖర్చు చేస్తున్నారు. రోజువారీగా చూస్తే కింది స్థాయి. పేదలు రోజుకి సగటున రూ.46, పట్టణ ప్రాంతాల్లో రూ.67 ఖర్చు చేస్తుంటే, ధనవంతులు గ్రామాల్లో రోజుకి రూ.350, పట్టణ ప్రాంతాల్లో రూ.700 ఖర్చు చేస్తున్నారు. స్థూలంగా గ్రామీణ ప్రాంతంలో 8 రెట్లు, పట్టణ ప్రాంతాలో 10 రెట్లు పేదల కంటే ధనికులు ఎక్కువగా వినిమయం చేస్తున్నారు. ప్రజల మధ్య వినిమయ అంతరాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నయో అర్థం చేసుకోవచ్చు. వివిధ వినిమయ తరగతుల వారీగా వ్యయాన్ని పరిశీలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం ప్రజలు సగటు వినిమయం కంటే వెనుకబడి ఉన్నారు.

ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రజలకు అందుతున్న వాటి విలువను కూడా ప్రత్యేకంగా లెక్కగట్టి వినియోగ వ్యయంలో కలిపారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ద్వారా తలసరి నెలకు 5 కిలోల చొప్పున అందుతున్న బియ్యం లేదా గోధుమలు, స్కూలు యూనిఫామ్‌లు, లాప్టాప్‌లు, సైకిళ్లు, మెబైళ్లు తదితర వాటినన్నింటిని పరిగణలోకి తీసుకొని విడుదల చేసిన ఫలితాలు చూస్తే కళ్లు తెరిపిస్తాయి. వీటి విలువను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రతి వ్యక్తి నెలకు అదనంగా రూ.87 ఖర్చు చేస్తున్నట్లు తేల్చారు.

వివిధ ఖర్చులను చూస్తే ఆహారం మీద పెడుతున్న ఖర్చు ఈ పదేళ్ళల్లో తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన 11 ఏళ్ళలో ఆహారంపై ఖర్చు గ్రామీణ ప్రాంతంలో 46 శాతం, పట్టణ ప్రాంతంలో 39 శాతానికి తగ్గింది. తొలిసారిగా ప్రజలు ఆహారంపై చేసే వ్యయం 50 శాతం లోపుకు పడిపోయింది. అలాగే ఆహారేతరాలపై పెట్టే వ్యయం గ్రామీణ ప్రాంతంలో 54 శాతం, పట్టణ ప్రాంతంలో 61 శాతానికి పెరిగింది. దీనిని కూడా ప్రభుత్వం తన ఘనకార్యంగా చెపుకుంటున్నది. వాస్తవంగా సర్వే కాలానికి ముందే ఆహార వస్తువుల ధరలు, రిటైల్డ్‌ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. దీనివల్ల ఆహార వస్తువులపై వినిమయం తగ్గిండొచ్చు. అలాగే విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు వంటి కొన్ని ముఖ్యమైన వాటిపై అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వం సృష్టించింది. 2022-23 ప్రజల వినిమయ వ్యయంలో దేశంలో ఆంధ్ర రాష్ట్ర స్థానాన్ని చూస్తే గ్రామీణ ప్రాంత వ్యయంలో 15వ స్థానంలోను, పట్టణ ప్రాంతంలో 17వ స్థానంలో ఉంది.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ అంకెలను చూపి అభివృద్ధి ప్రకటనలు గుప్పిస్తున్నది. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయని, ప్రజల వినియోగ వ్యయం పెరుగుదలే ఇందుకు తార్కాణమని ఊదరగొడుతున్నది. ప్రజల మధ్య ఆదాయ అంతరాలు కూడా తగ్గుముఖం పట్టాయనే ప్రచారానికి కూడా ఈ నివేదికను వాడుకుంటున్నది. వాస్తవంగా ఈ సర్వేని 2011-12 సర్వేతో పోల్చి విశ్లేషణ చేయడం సరైంది కాదు. ఎందుకంటే గత సర్వే కేవలం ఒక ప్రశ్నావళి ద్వారానే కుటుంబాల నుండి సమాచారాన్ని సేకరించింది. 2022-23 సర్వేలో 4 ప్రత్యేక ప్రశ్నావళుల ద్వారా మూడుసార్లు ఇళ్ల నుండి సమాచారం తీసుకున్నారు. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాలను ఎక్కువ భాగం జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ఎంపిక చేశారు. అలాగే భూమిని కూడా ప్రామాణికంగా ఎంచుకున్నారు. పట్టణ ప్రాంతంలోనైతే 10 లక్షల పైబడి, 10 లక్షల లోపు విలువ గల కారు యజమాని కుటుంబాలను కూడా ప్రత్యేకంగా సర్వేలో తీసుకున్నారు. అలాగే గతంలో సర్వేలో ఉండి, ప్రస్తుతం ప్రజల వినియోగంలో లేని వస్తువులను సర్వే నుండి తొలగించి, కొత్త వినిమయ వస్తువులను ఈ సర్వేలో చేర్చారు. ఫలితంగా సర్వే వస్తువుల సంఖ్య 347 నుండి 405కి పెరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా లెక్కించి వినిమయ ఖర్చులో కలిపారు. గతంలో ఇది లేదు.

ఈ సర్వే ధరల పెరుగుదలను, రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కోవిడ్‌ రెండేళ్ల కాలంలో ప్రజల ఆదాయ వ్యయాలు దారుణంగా పడిపోయాయి. ఆ తరువాత కాలంలో నెమ్మదిగా కోలుకొని సర్వే కాలం నాటికి కొంత వినిమయాన్ని పెంచుకున్నారు. దీనివల్ల ప్రజల వ్యయంలో ఒక్కసారిగా పెరుగుదల మనకి కన్పిస్తుంది. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని తొక్కిపెట్టి ప్రజల వినిమయం పెరిగినట్లు చూపిస్తున్నది.

ఈ సర్వే గణాంకాలను చూపి దేశంలో పేదరికం 5 శాతం లోపుకి తగ్గిపోయిందనే ప్రచారానికి కూడా ఒడిగట్టింది. నీతి ఆయోగ్‌ సిఇఓ ద్వారా ప్రచారంలో పెట్టింది. దీంతో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన 27 పేజీల వాస్తవ నివేదికలో పేదరికం తగ్గిందని ఎక్కడా ప్రస్తావించలేదు. పైపెచ్చు ప్రభుత్వం పేదరికం తగ్గిందని చూపిస్తున్న మదింపు లెక్కలు కూడా పూర్తిగా అశాస్త్రీయమైనవి. ఇందుకు ఎటువంటి ప్రతిపాదిక లేదు. దేశంలో పేదరిక గీతకు సంబంధించి టెండూల్‌కర్‌ కమిటీ లేదా ప్రణాళికా సంఘం చేసిన సిఫార్సులకు లేదా ఇప్పటి వరకు దేశ పేదరికం లెక్కలకు సంబంధించి అనుసరిస్తూ వస్తున్న విధానానికి ఇది పూర్తిగా విరుద్ధమైనది.

భారతదేశంలో 2011 నుండి పేదరిక లెక్కలు విడుదల చేయడం లేదు. ప్రణాళికా సంఘం రద్దయిన తరువాత ఉనికిలోకి వచ్చిన నీతి ఆయోగ్‌ కూడా దారిద్య్ర రేఖకు ఎలాంటి కొలమానాలను రూపొందించలేదు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం 11 శాతం మంది అంటే 18.9 కోట్ల మంది ప్రజలు భారత దేశంలో ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నది. అలాగే ప్రపంచ ఆకలి సూచిలో 125 దేశాల్లో భారత్‌దేశం 111వ స్థానంలో ఉంది. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు అతి తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక గ్రామీణ ప్రాంతంలో రోజుకి 2200 క్యాలరీలు, పట్టణ ప్రాంతంలో రోజుకి 2100 క్యాలరీలు ఆహారం పొందాలంటే ప్రస్తుత ధరల ప్రకారం మదింపు చేస్తే దేశంలో 58 శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు తెలుస్తున్నది.

నయా ఉదారవాద కాలంలో దేశంలో పోషకాహార పేదరికం బాగా పెరిగిందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ ఆరోగ్య సర్వే కూడా 15-49 వయస్సు గల మహిళల్లో రక్తహీనత 2015-16లో 53 శాతం నుండి 2019-20కి 58 శాతానికి పెరిగిందని తేల్చి చెప్పింది. ఈ కఠోర వాస్తవాలన్నింటిని మరుగున పెట్టి 2022-23 కుటుంబ వినిమయ సర్వే సంక్షిప్త నివేదికను తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటూ దేశాన్ని మోసం చేస్తున్నది. 2021లో పూర్తి చేయాల్సిన జనాభా లెక్కలను కూడా ప్రారంభించకుండా అనేక వివాదాలను సృష్టించి వాయిదా వేస్తూ వస్తున్నది. ఈ సర్వే జరిగితే మోడీ పదేళ్ళ అభివృద్ధి బండారం బట్టబయలౌతుంది.

  • వ్యాసకర్త సెల్‌ : డా|| బి.గంగారావు, 9490098792
➡️