షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

Mar 28,2024 12:38 #Krishna district

వేములపల్లి ఎస్సీ కాలనీలో  ఘటన
రూ.2.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా

ప్రజాశక్తి-ఘంటసాల :  ఘంటసాల మండలం వేములపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒంటి నిట్టాడి ఇల్లు దగ్దమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు వేములపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మునిపల్లి ఏడుకొండలుకు చెందిన ఇంటిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఇంటిని చుట్టుముట్టాయి. స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు మొవ్వ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు మొత్తం కలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిప్రమాదంలో ఐదు మినుము బస్తాలు, బీరువా, మంచాలు, సర్వం కలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, విఆర్వో యువరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అగ్నిప్రమాద బాధితులను స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️