15 నుంచి హాట్ స్టార్ ‘సేవ్ ద టైగర్స్ 2’ స్ట్రీమింగ్ 

Mar 10,2024 17:02 #movies, #New Movies Updates

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మహీ వి రాఘవ్ మాట్లాడుతూ – ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ విషయంలో ముందుగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగానే సీజన్ 2 కూడా అనుకుని ఓకే చేయించుకున్న ఫస్ట్ సిరీస్ ఇదే అనుకుంటా. ఇలాంటి ఫన్ ఎంటర్ టైనింగ్ షోస్ లో రైటింగ్ కంటే ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ చాలా ముఖ్యం. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత వంటి యాక్టర్స్ అంతా ఈ కథని ఓన్ చేసుకుని నటించారు. మేము ఎడిటింగ్ టైమ్ లో చూసినప్పుడు, ఇప్పుడు మీ మధ్య సిరీస్ చూసినప్పుడు రెస్పాన్స్ లో వేరియేషన్ చూశాం. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్ గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సీజన్ 1 చేసిన ప్రదీప్ కు, ఇప్పుడు సీజన్ 2కు డైరెక్షన్ చేసిన అరుణ్ కు థ్యాంక్స్. ఈ సెకండ్ సీజన్ కూడా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేవ్ ద టైగర్స్ లో మరిన్ని సీజన్స్ చేయాలనే ఆలోచన ఉంది. నాలుగైదు సీజన్స్ తర్వాత ఇందులో బాగా వర్కవుట్ అయిన క్యారెక్టర్స్ ను తీసుకుని సినిమా కూడా చేసుకోవచ్చు’ . అన్నారు.

➡️