ఉద్యాన వ(ధ)నం

Apr 10,2024 22:03

సీతంపేట ఐటిడిఎలో హెచ్‌ఎన్‌టిసి (హార్టికల్చర్‌ నర్సరీ కమ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ద్వారా రైతులకు ఒకప్పుడు మొక్కలు కావాలంటే కడియం నుంచి తెప్పించేవారు. దీనికి రవాణా ఛార్జీలు తడిస ిమోపెడు అయ్యేవి. పర్యావసానం.. హెచ్‌ఎన్‌టిసిల సిబ్బందికి జీతాలు సరిగా అందేవి కాదు. నిర్వహణ కూడా భారమయ్యేది. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆదాయ పంట పండుతోంది. సీతంపేట ఐటిడిఎలో ఉద్యానశాఖ శాఖకు హెచ్‌ఎన్‌టిసిలు కల్పతరువుగా మారాయి. రైతులకు అన్ని రకాల మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. అధిక దిగుబడినిచ్చే మొక్కలు అందు తున్నాయి. అటు రైతులకు, ఇటు హెచ్‌ఎన్‌టిసికి లాభాల పంట పడుతోంది. ఇంచుమించుగా ఆరేడు నెలల్లోనే ఈ మార్పు వచ్చింది. అందుకు ప్రత్యేక కారణం.. పిహెచ్‌ఒ గణేష్‌. ఆయన బాధ్యతలు చేపట్టాక.. హెచ్‌ఎన్‌ టిసిల రూపు రేఖలు పూర్తిగా మారాయి. మొక్కలు కొనుక్కొనే పరిస్థితి పోయి.. ఇక్కడి నుంచే లక్షలాది మొక్కలు పంపిణీ చేసే స్థితికి హెచ్‌ఎన్‌టిసిలు వచ్చాయంటే, ఆయన కృషి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజాశక్తి-సీతంపేట:  సీతంపేట ఐటిడిఎకు అనుబం ధంగా ఉన్న ఉద్యాన శాఖ ద్వారా తురాయి పువలస, పాతపనుకంవలసలో హెచ్‌ఎన్‌టిసి (హార్టికల్చర్‌ నర్సరీ కమ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ఫారాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటిపై గత ఐటిడిఎ పిఒలు ప్రత్యేక దృష్టిసారించి అధిక ఫల సాయం తెప్పించేవారు. రానురాను ఆదరణ తగ్గుతున్న సమయంలో పిహెచ్‌ఒగా ఎస్‌వి గణేష్‌ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఫారం తాలూకా రూపురేఖలు మార్చేశారు. ఎకో పార్కు తరహాలో నర్సరీని బంగారు వర్ణాలుగా తీర్చిదిద్దారు. నర్సరీకి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణంతో కనువిందు చేసే పువ్వులు దర్శనమిస్తాయి. కొబ్బరి మొక్కలు వీచే గాలులు గుండెకి తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఆరు నెలల్లో మార్పులు చేసి, కొత్త ఆదాయాలు తెచ్చి పెట్టే విధంగా పిహెచ్‌ఒ చేసిన కృషిని ప్రస్తుత పిఒ కల్పనకుమారి గుర్తించి, ఉత్తమ అధికారిగా రిపబ్లిక్‌ డే సందర్భంగా అవార్డు అందజేశారు. చోడవరంలో ఉన్నప్పుడు కలెక్టర్‌ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలోని 20 మండలాల్లో ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ సమన్వయంతో సుమారు 3 వేల ఎకరాలకు కడియం నుంచి గతంలో మొక్కలు తెప్పించేవారు. దానికి రవాణా ఛార్జీలు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసేవారు. అది ఒకప్పటి మాట. ప్రాజెక్టు హార్టికల్చర్‌ అధికారిగా ఎస్‌.వి.గణేష్‌.. చోడవరం నుంచి గతేడాది ఆగస్టులో ఉద్యోగోన్నతిపై వచ్చారు. అప్పటికే హెచ్‌ఎన్‌టిసి ఫారాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 40 మంది సిబ్బంది ఉన్నప్పటికీ సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతుం డేవారు. పంపిణీ చేసిన మొక్కల డబ్బులు కూడా సుమారు రూ.36 లక్షల వరకు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా రాలేదు. దీంతో తదుపరి కార్యాచరణ కూడా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక ప్రణాళికతో..ఇక్కడి హెచ్‌ఎన్‌టిసిల పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చిన పిహెచ్‌ఒ.. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ముందుగా హార్టికల్చర్‌ నర్సరీ ట్రైనింగ్‌ సెంటర్లో పది మంది నైపుణ్య సిబ్బందిని గుర్తించారు. అన్ని వసతులు ఉన్నాయని గుర్తించి, ఇక్కడే మొక్కలు తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముందుగా ఉపాధి హామీ ద్వారా రావాల్సిన రూ.36 లక్షలు తెప్పిస్తూ, సిబ్బందికి జీతాలు పెంచుతూ, నెల నెలా సకాలంలో వేతనాలు అందేలా ఉన్నత అధికారుల దృష్టి తీసుకొని వెళ్లి పరిష్కరించారు. దీని ద్వారా ఒక అడుగు ముందుకు వేశారు.ఇక్కడి నుంచే మొక్కలు పంపిణీ సీతంపేట ఐటిడిఎ పరిధిలో 20 మండలాల్లో సుమారు 8 వేల మంది రైతులు ఉన్నారు. ఈ రెండు ఫారాల్లో ప్రభుత్వం నిర్ణయించే ధరకు ఏ మొక్క అడిగినా దొరికినట్లుగా పార్కు మాదిరిగా తయారు చేశారు. ఇంతకుముందు ఈ ఫారం వాళ్లే మొక్కలు కొనడానికి కడియం వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వీటిలో రెండు లక్షలు జీడి, లక్ష టేకు, 15 వేల సీతాఫలాలు, 25 వేలు నిమ్మ, 20 వేల జామి, 10 వేలు కొబ్బరి, 20 వేల సపోటా.. ఇలా 4 లక్షల మొక్కలు తయారు చేశారు. 20 మండలాల్లో 3 వేల ఎకరాల్లో ఉపాధి హామీ ద్వారా మొక్కలు సరఫరా చేయడానికి సిద్ధం చేశారు. అంతేకాకుండా రైతులకు అన్ని మొక్కలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజనులు ఆధారమైన ఆర్థిక వనరులు జీడి, పసుపు, పైనాపిల్‌. దీనికి సంబంధించి మొక్కలు పిహెచ్‌ఒ గణేష్‌ ప్రత్యేకంగా నడుం బిగించారు. జీడి మొక్కలు త్వరగా ఇవ్వడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. జులైలో వర్షాలు పడేసరికి రెండు లక్షల మొక్కలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.ఆదాయ పంటనర్సరీలో నిధులు ప్రత్యేకంగా ఉండాలని ఉద్దేశంతో పామాయిల్‌ తోటలు కూడా వేయడానికి పిహెచ్‌ఒ ప్రత్యేక దృష్టిసారించారు. సుమారు ఏడాదికి రూ.50 లక్షలు నుంచి 60 లక్షల వరకు ఆదాయం వచ్చేటట్లు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా 30 ఏళ్ల నాటి మొక్కలతో ఫల సాయం రైతులకు తక్కువ వస్తుందనే ఉద్దేశంతో కొత్త రకాలపై దృష్టిపెట్టారు. జీడిమొక్క 20 కిలోల వరకు పంట దిగుబడి వచ్చేలా నాణ్యమైన మొక్కల కొత్త రకాలపై ఆలోచన చేశారు. బాపట్ల జీడి, సంకరజీడి రకాలు 8, 9 రకాలు, వేంగళూరు 4, వృద్ధాచలం జీడి తయారు చేశారు. మామిడి రకాల్లో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీళాలు, రాయల్‌ స్పెషల్‌… ఇలా 30 రకాలు సిద్ధం చేశారు. సపోటాలో పాల వెరైటీ, క్రికెట్‌ బాల్‌ కాలవత్తి, జామిలో హలహలబాద్‌, సఫీదు, ఆర్కే గ్రీన్‌, లక్నో ఎల్‌ 49, తైవాన్‌, సీతాఫలంలో బాలానగర్‌, బాలాజీ, తదితర కొత్త రకాలు తయారుచేసి అందుబాటులో తెచ్చారు. ఇలా హెచ్‌ఎన్‌టి కేంద్రానికి అధిక ఆదాయం సమకూర్చారు.రూ.2 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలుసీతంపేట ఐటిడిఎ పరిధిలో ఉన్న రెండు హెచ్‌ఎన్‌టిసిలు 130 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహణకు ఖర్చులు తీసి పోగా, రెండు కోట్ల ఆదాయం వచ్చేటట్లు ప్రణాళికలు రూపొందించాం. అందుకనుగుణంగా ఉన్నతాధికారులు, ఐటిడిఎ పిఒ కల్పనకుమారి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి మొక్కను గిరిజన రైతులకు ప్రభుత్వం నిర్ణయించే ధరకు అందిస్తాం. – ఎస్‌.వి.గణేష్‌, పిహెచ్‌ఒ, సీతంపేట ఐటిడిఎ

➡️