అవినీతిలో ‘హౌమ్‌’ ఫస్ట్‌ 

home minister department in corruption

 

పంచాయతీ విభాగం సెకండ్‌

గుజరాత్‌ ఎసిబి గణాంకాలు

అహ్మదాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిపై గుజరాత్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గణాంకాలు విడుదల చేసింది. అవినీతిలో రాష్ట్ర హౌంశాఖ మొదటి స్థానంలో ఉండగా, పంచాయతీ శాఖ రెండో స్థానంలో ఉన్నది.ఏసీబీ ఏడాది గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్‌ 20 వరకు అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, వడోదర, పంచమహల్‌, సూరత్‌ రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జునాగఢ్‌, సరిహద్దు ప్రాంతాల్లోని 37 పోలీస్‌ స్టేషన్లలో 199 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఇందులో క్లాస్‌-1 ప్రభుత్వ అధికారులపై 7, క్లాస్‌-2 అధికారులపై 28, క్లాస్‌-3 అధికారులపై 130, క్లాస్‌-4 అధికారులపై 7 కేసులు రికార్డయ్యాయి. మధ్యవర్తులుగా పనిచేస్తున్న 104 మంది ప్రయివేట్‌ వ్యక్తులపై కూడా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలా ఒక్క ఏడాదిలోనే ఏసీబీ 276 మందిపై అవినీతి ఆరోపణలు చేసింది.గుజరాత్‌లో హౌం శాఖపై 66 అవినీతి ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసులలో రెండు కేసులు క్లాస్‌-2 ప్రభుత్వ అధికారులు, 63 కేసులు క్లాస్‌-3 అధికారులతో పాటు 29 ప్రభుత్వేతర వ్యక్తులు ఉన్నారు. ఇలా ఏడాది వ్యవధిలో హౌం శాఖతో సంబంధం ఉన్న 94 మంది ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యక్తులపై ఏసీబీ కేసు నమోదు చేసి రూ.38 లక్షలకుపైగా లంచం స్వాధీనం చేసుకుంది.అవినీతి ఫిర్యాదుల పరంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్ర పంచాయతీ విభాగంలో 2023లో వివిధ అధికారులపై 35 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి క్లాస్‌-1 అధికారి, 16 ఫిర్యాదులు క్లాస్‌-3 అధికారులపై ఉన్నాయి. వీటితో పాటు 29 మంది ప్రభుత్వేతర వ్యక్తులతో సహా. రూ.14,98,520 లంచం ఏసీబీకి పట్టుబడింది. గుజరాత్‌లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ మూడో స్థానంలో ఉన్నది. రూ. 15 లక్షలకుపైగా లంచాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకున్నది.

➡️