హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి : ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల సందర్భంగా డ్రైవర్లకు తీవ్రమైన శిక్షలను విధించేలా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహితలోని 106(1), 106(2) చట్ట సవరణను ఉపసంహరించాలని ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్‌టిసి ఉద్యోగ సంఘాల సమావేశం ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ సుందరయ్య అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఎంప్లాయీ స్‌ యూనియన్‌ నుంచి ఎం శంకర్రావు, ఎన్‌ఎంయు నుంచి కె శ్రీనివాసరాజు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నుంచి ఎస్‌కె జిలాని బాషా, ఎం అయ్యపురెడ్డి, డి మల్లికార్జున, బిసి అసోసియేషన్‌ నుంచి ఎస్‌పి శేషగిరి, ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్‌ నుంచి పి కిరణ్‌, సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌ నుంచి ఎంఎ విష్ణారెడ్డి, సిహెచ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో శిక్షపడేలా తీసుకొచ్చిన చట్ట సవరణను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 16న జరిగే జాతీయ కార్మిక సమ్మెలో పెద్దయెత్తున డ్రైవర్లు పాల్గొనాలని సమావేశం తీర్మానం చేసింది. రవాణా రంగానికి ముప్పుగా మారే ఈ చట్టసవరణ రద్దు కోసం అన్ని రాజకీయ పార్టీలకూ వినతిపత్రాలివ్వా లని సమావేశం నిర్ణయించింది.

➡️