వెల్లడైన హిందూత్వ-కార్పొరేట్‌ బంధం

Mar 24,2024 04:16 #editpage

ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినంతవరకు, అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత… ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె మాట్లాడుతూ… ఎన్నికల బాండ్లను సమర్ధించారు. ”ఎన్నికల బాండ్ల పథకమనేది
ఒక ప్రయోగం, అనేక స్థాయిల్లో అనేక అంశాలను పరిశీలించిన మీదట తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఏదో అకస్మాత్తుగా ప్రవేశపెట్టలేదు.” అని చెప్పుకొచ్చారు. ”ఏదైనా ఒక మార్పును తీసుకువచ్చినపుడు, అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవిఎంలను ప్రవేశ పెట్టినపుడు కూడా ఇలాగే అనేక ప్రశ్నలు తలెత్తాయి.” అని ఆయన పేర్కొన్నారు. ఆ రకంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినంత వరకు, ఎన్నికల బాండ్ల పథకమనేది ఒక విలువైన ప్రయోగం. అనవసరంగా దీన్ని ఆపరాదు. అని చెప్పడం ద్వారా హిందూత్వ ప్రాజెక్టుతో కార్పొరేట్లు అనుసంధానమయ్యారని ఆర్‌ఎస్‌ఎస్‌ పరోక్షంగా అంగీకరించినట్లే అయ్యింది.

ఇప్పటివరకు విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను చూసినట్లైతే మతం-కార్పొరేట్‌ బంధం…మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే…దేశంలో హిందూత్వ-కార్పొరేట్‌ మధ్య నెలకొన్న సంబంధం స్పష్టంగా ధృవీకరించబడింది.
అందుబాటులో వున్న డేటా ప్రకారం, ఎన్నికల బాండ్ల పథకం ద్వారా ప్రధానంగా లబ్ధి పొందింది బిజెపి. 2018లో ఈ బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా రూ.8,252 కోట్లు పొందింది. అంటే బాండ్ల ద్వారా వచ్చిన మొత్తంలో 50 శాతం ఈ పార్టీకే వెళ్ళిందన్నమాట. పాలక పార్టీకి, కార్పొరేట్లకు మధ్య లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందమిది. దీన్ని మోడీ ప్రభుత్వం చట్టబద్ధం చేసేసింది. కాంట్రాక్టులపై ముడుపులు ఇవ్వడం, లాభాలపై కమిషన్లు అందుకోవడం కార్పొరేట్లకు, బూర్జువా ప్రభుత్వానికి మధ్య గల వ్యాపార లావాదేవీలుగా వున్నాయి. చాప కింద నీరులా సాగుతున్న ఇదంతా రాజకీయ అవినీతికి మూలాధారమైంది. ఇటువంటి అవినీతిని చట్టబద్ధం చేయడానికి మోడీ ప్రభుత్వ అపరిమితమైన తెలివితేటలు ఉపయోగపడ్డాయి.
ఇలా బలవంతపు వసూళ్ళ ప్రహసనంలో కార్పొరేట్లు అమాయకులైన బాధితులని అనుకోవడం, అలా చూపించడం పొరపాటే కాగలదు. ముడుపులు, కమిషన్ల రూపంలో బిజెపికి ఎన్నికల బాండ్ల ద్వారా పెద్దమొత్తంలో నిధులు అందాయి. భవిష్యత్తులో కావాల్సిన పనులను చేసిపెట్టడానికి అవసరమైన గుడ్‌విల్‌ కూడా ఈ బాండ్ల ద్వారానే వారు సంపాదించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎం.ఇ.ఐ.ఎల్‌) అందచేసిన బాండ్లలో చాలా వరకు ఈ కేటగిరీలోకే వస్తాయి. ఉదాహరణకు, రూ.14,400 కోట్ల బిడ్‌ మొత్తంతో థానే-బోరివలి సొరంగం ప్రాజెక్టు కోసం వేర్వేరుగా రెండు ప్యాకేజీలను ఎం.ఇ.ఐ.ఎల్‌ పొందింది. ఇందులో పెద్ద మొత్తాన్ని ఎన్నికల బాండ్ల ద్వారా కాంట్రాక్టుకు చాలా నెలలు ముందుగానే సంస్థ అందచేసింది. జోజిలా రోడ్‌ సొరంగం ప్రాజెక్టుకు కూడా ఇదే ధోరణి వర్తించింది. అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతులు పొందడం కోసం కొన్ని మైనింగ్‌ కంపెనీలు కూడా పాలక పార్టీకి ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తాలు చెల్లించాయి.
ఇక, ఫార్మస్యూటికల్‌ రంగానికి చెందిన పలు కంపెనీలు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా పెద్ద మొత్తాలనే అందచేశాయి. ఇక్కడ, మొత్తంగా 35 ఫార్మా కంపెనీలు బాండ్ల ద్వారా ఏకంగా దాదాపు రూ.1000 కోట్లు ఇచ్చాయి. వీటిలో, ఇప్పటివరకు ఏడు కంపెనీలను గుర్తించారు. వాటిపై జరిపిన దర్యాప్తు ప్రకారం నాణ్యత లేని ఔషధాలు తయారు చేసినందుకు ఆ కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి. దీనివల్ల నాసిరకం మందులు ఉత్పత్తి చేస్తున్నందుకు ఎదురయ్యే చర్యలను తప్పించుకోవడానికి ఈ కంపెనీలకు ఇవి ఎంతగానో సహాయపడ్డాయి.
అజ్ఞాత బాండ్ల పథకం ద్వారా క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత, నాకు అంత) జరిగిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రకంగా పార్టీకి నిధులను సేకరించే పద్ధతికి మోడీ ప్రభుత్వం మరో అరిష్టదాయకమైన కొత్త కోణాన్ని చేర్చింది. రాజకీయ ప్రత్యర్ధులను, స్వతంత్ర వార్తా సంస్థలను, సివిల్‌ సొసైటీ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ, ఆదాయ పన్ను విభాగాలు వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా ఉపయోగిస్తున్నారో మనం ఇప్పటికే చూస్తున్నాం. ఈ రకంగా ఈ సంస్థలను చట్ట విరుద్ధంగా ఉపయోగిస్తూ కార్పొరేట్ల నుండి నిధులను బలవంతంగా వసూలు చేయడానికి సృజనాత్మకంగా వర్తింపచేశారు. కార్పొరేట్ల దుర్వినియోగాలు అవి వాస్తవమైనవి లేదా ఊహించినవి ఏవైనా సరే దాడులు చేయడానికి, దర్యాప్తు చేపట్టడానికి, నిధులు, ఆస్తులను జప్తు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇటువంటి కంపెనీల యజమానులే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి, కేంద్రంలోని పాలక పార్టీకి ఉదారంగా విరాళాలు అందచేశారని వెల్లడైంది. ఇటువంటి బలవంతపు నిధుల వసూళ్ళలో రెండు కోణాలు వున్నాయి-ఒకటి, చట్టవిరుద్ధమైన బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్ల ద్వారా బలవంతపు వసూళ్ళ నేరానికి పాల్పడ్డం. ఇందుకు ప్రభుత్వ సంస్థలు సహకరిస్తాయి. రెండోది, వాస్తవంగానే చట్టాన్ని ఉల్లంఘించి, తీవ్రమైన అవకతవకలకు, దుర్వినియోగాలకు పాల్పడిన వారు ముడుపులు చెల్లించడానికి అనుమతించడం.
పారదర్శకత గురించి గొప్పగా చెబుతూ, పరిశుద్ధమైన నిధులే రాజకీయ వ్యవస్థలోకి వస్తున్నాయని చెప్పుకోవడాన్ని అవహేళన చేసేలా పెద్ద మొత్తంలో నల్ల ధనాన్ని వెలికి తీయడానికి, మనీ లాండరింగ్‌కు వెసులుబాటు కల్పించేలా బూటకపు కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయనడానికి తగినన్ని సాక్ష్యాధారాలు కూడా బయటపడ్డాయి. ఉదాహరణకు, అస్సలు లాభాలు కూడా ఆర్జించని కంపెనీలు కూడా కొన్ని బాండ్ల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు అందచేశాయని వెల్లడైంది. గత నాలుగేళ్ల కాలంలో అటువంటి కంపెనీలు సంపాదించిన లాభాల కంటే చాలా పెద్ద మొత్తంలో నిధులను బాండ్ల ద్వారా అందచేశాయి.
ఈ రకంగా ఎన్నికల బాండ్ల పథకమనేది హిందూత్వ -కార్పొరేట్‌ సంబంధాల నుండి పుట్టుకొచ్చినదేనన్న విషయం స్పష్టమైంది. ఒకవైపు వ్యాపార సంస్థలు, సంఘాల నుండి వచ్చిన ప్రతిస్పందనలు మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించిన తీరు చూస్తుంటే ఇది తేటతెల్లమవుతోంది.
ఎన్నికల బాండ్లకు సంబంధించిన విశిష్ట గుర్తింపు సంఖ్యలను వెల్లడించకుండా నిలుపు చేయాలని కోరుతూ పారిశ్రామిక రంగంలోని మూడు ప్రధాన సంస్థలైన-ఫిక్కి (భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య), భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌)లు సంయుక్తంగా సుప్రీం కోర్టులో మధ్యవర్తిత్వ దరఖాస్తును దాఖలు చేశాయి. ”చట్టబద్ధ పాలనను దెబ్బ తీసేలా, పారిశ్రామిక ప్రయోజనాలకు తీవ్రమైన పర్యవసానాలు కలిగించేలా విశ్వసనీయమైన ఒప్పందాల ఉల్లంఘన” గురించి ఈ పారిశ్రామిక సంస్థలు మాట్లాడుతున్నాయి. వివిధ క్విడ్‌ ప్రో కో ఒప్పందాలతో సంబంధం వున్న నేపథ్యంలో తమ రహస్య ఒప్పందాల గురించి బయటకు వెల్లడవ్వాలని కార్పొరేట్లు కోరుకోవడం లేదు. అయితే, సుప్రీం కోర్టు వారి దరఖాస్తును విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినంత వరకు, అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె మాట్లాడుతూ, ఎన్నికల బాండ్లను సమర్ధించారు. ”ఎన్నికల బాండ్ల పథకమనేది ఒక ప్రయోగం, అనేక స్థాయిల్లో అనేక అంశాలను పరిశీలించిన మీదట తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఏదో అకస్మాత్తుగా ప్రవేశపెట్టలేదు.” అని చెప్పుకొచ్చారు. ”ఏదైనా ఒక మార్పును తీసుకువచ్చినపుడు, అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవిఎంలను ప్రవేశ పెట్టినపుడు కూడా ఇలాగే అనేక ప్రశ్నలు తలెత్తాయి.” అని ఆయన పేర్కొన్నారు. ఆ రకంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినంత వరకు, ఎన్నికల బాండ్ల పథకమనేది ఒక విలువైన ప్రయోగం. అనవసరంగా దీన్ని ఆపరాదు. అని చెప్పడం ద్వారా హిందూత్వ ప్రాజెక్టుతో కార్పొరేట్లు అనుసంధానమయ్యారని ఆర్‌ఎస్‌ఎస్‌ పరోక్షంగా అంగీకరించినట్లే అయ్యింది.
ఇప్పుడు, ఎన్నికల బాండ్లకు సంబంధించిన డేటా మొత్తాన్ని- వాటి విశిష్ట సంఖ్యలతో సహా మార్చి 21కల్లా ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాలని ఎస్‌బిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనితో జారీ చేసిన బాండ్ల విశిష్ట గుర్తింపు సంఖ్యతో దాన్ని రెడీమ్‌ చేసుకున్న వివరాలు సరిపోలితే ఎవరు, ఎంత మొత్తాలను ఏ పార్టీకి, ఏ సమయంలో ఇచ్చారో తెలిసిపోతుంది. దీనివల్ల హిందూత్వ పార్టీకి, కార్పొరేట్లకు మధ్యగల లోతైన సంబంధాలు మరింతగా ధృవీకరించబడతాయి.
అవకతవకలు, అవినీతి ముడుపులు, మనీ లాండరింగ్‌, బ్లాక్‌మెయిల్‌, బెదిరింపుల ద్వారా బలవంతపు వసూళ్ళు వంటి వాటికి సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా అందిన ఈ సమాచారంతో ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు తలెత్తే ప్రధానమైన ప్రశ్నగా వుంది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టడమొక్కటే సాధ్యమైన కార్యాచరణగా వుండనుంది. ఆ దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రాతిపదికన ఎక్కడ అవసరమైతే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

(మార్చి 18 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️