హిందూ రాజ్యం అంటే?

Apr 9,2024 06:20 #artical, #edit page, #PM Modi

హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఏర్పడి పని చేస్తోంది. ఈ హిందూ రాజ్యం అంటే ఏమిటి? ఏదో ఒక్క మతానికి మాత్రమే తక్కిన మతాలకన్నా అధిక ప్రాధాన్యతనిచ్చిన దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వీటిని మత ప్రమేయం ఉండే రాజ్యాలని అంటాం. అంతమాత్రం చేత ఆ రాజ్యాల వర్గ స్వభావంలో అణు మాత్రమైనా తేడా రాదు. అంటే మత ప్రాతిపదికన ఒక రాజ్యం వర్గ స్వభావాన్ని నిర్ధారించలేం. నిజానికి అటువంటి రాజ్యాలు అనివార్యంగా భయోత్పాతాన్ని సృష్టించే నియంతృత్వ రాజ్యాలుగా, గుత్త పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేసే రాజ్యాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ గుత్త పెట్టుబడిదారీ శక్తులలో కొత్తగా బలపడిన శక్తుల సేవలో అవి పని చేస్తాయి. కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు జార్జి డిమిట్రోవ్‌ ఏడవ అంతర్జాతీయ మహాసభలో ఫాసిస్టు రాజ్యం గురించి ఈ విధంగా నిర్వచించాడు: ”ద్రవ్య పెట్టుబడి శక్తులలో అత్యంత తిరోగామి స్వభావం కలిగిన, రాజ్య విస్తరణవాద స్వభావం కలిగిన తరగతుల భయోత్పాత నియంతృత్వమే ఫాసిజం”. హిందూ రాజ్యం అంటే ఇటువంటి ఒక ఫాసిస్టు రాజ్యమే అని ఇప్పుడు వివరించబోతున్నాను.
హిందూ రాజ్యంగా ఏర్పడితే, అందులో అన్ని అధికారిక కార్యకలాపాలూ హిందూ దేవతల ఆరాధనలతో మొదలౌతాయి. అన్ని రహదారులకి, రైల్వే స్టేషన్లకి, నగరాలకి పాత, మధ్యయుగాల నుంచీ కొనసాగుతున్న పేర్లను మార్చి హిందూత్వ చిహ్నాల పేర్లు పెడతారు. విద్యా కార్యకలాపాలన్నీ సరస్వతీ వందనంతో మొదలౌతాయి. ప్రభుత్వ నిధులను సైతం వెచ్చించి మరెన్నో దేవాలయాలను నిర్మిస్తారు. కాని ఈ చర్యలేవీ సామాన్య హిందువు జీవితంలో ఏ చిన్నపాటి అభివృద్ధినీ తీసుకురాలేవు. టర్కీ పాలకుడు ఎర్డోగన్‌ దేశ రాజధాని ఇస్తాంబుల్‌లో ప్రసిద్ధి చెందిన హగియా సోఫియా కట్టడాన్ని ఒక మసీదుగా మార్చి తద్వారా ఇస్లామిక్‌ మనోభావాలను సంతృప్తిపరచడానికి పూనుకున్నాడు. కాని దాని వలన టర్కీలోని సగటు పౌరుడి జీవితంలో ఏ చిన్నపాటి మెరుగుదలా రాలేదు.
మనం ఇంకా మరికాస్త ముందుకు పోవచ్చు. ఇక్కడ ప్రస్తుత హిందూత్వ శక్తుల పాలనలోనే మనకున్న అనుభవాలను చూద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ చవిచూడనంత తీవ్ర నిరుద్యోగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించే సిఎంఐఇ సంస్థ లెక్కల ప్రకారం 2008-2019 మధ్య కాలంలో 5 లేదా 6 శాతంగా ఉంటూ వచ్చిన నిరుద్యోగం ప్రస్తుతం 8 శాతానికి పెరిగింది. అంటే హిందూత్వ శక్తుల పాలనలో ప్రభుత్వం నిరుద్యోగ పరిస్థితి క్షీణించకుండా అడ్డుకోవడంలో విఫలమైంది అని కనపడుతోంది. నిరుద్యోగాన్ని తగ్గించడంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడే బహిరంగ ప్రకటన చేశాడు! ఆ తర్వాత ఈ ప్రకటనను అతడు ఉపసంహరించుకున్నదీ లేదు. అతగాడి ప్రకటనతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం అధికారికంగా ఏ ప్రకటనా చేసిందీ లేదు. అంటే అది అధికారిక ప్రకటనగానే భావించాలి. అంటే ప్రస్తుతం కార్మిక వర్గానికి అత్యంత సమస్యాత్మకంగా ప్రస్తుత దయనీయ పరిస్థితులలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తాను చేయగలిగింది ఏమీ లేదని ప్రభుత్వమే ప్రకటించిందన్నమాట.
అంటే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగితే సామాన్య ప్రజల దుస్థితి కూడా కొనసాగుతుంది. దాని విషయంలో ప్రభుత్వం చేసేది ఏమీ ఉండబోదు. తప్పుడు లెక్కలతో అంచనాలు కట్టిన జిడిపి వృద్ధి రేటు ఎంత గొప్పగా పెరుగుతోందో టాం టాం చేసుకోవడం మాత్రం జరుగుతుంది. ఆ పేరు చెప్పి తమ ప్రభుత్వం కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచి పెట్టడాన్ని సమర్ధించుకుంటుంది. సామాన్య ప్రజల దుర్భర పరిస్థితుల గురించి వాస్తవ పరిస్థితిని వెల్లడించే ప్రయత్నాలు చేసే వారిని ఆడిపోసుకుంటుంది. ఇప్పుడు హిందూత్వ శక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం తీరు ఇలాగుందంటే ఇక హిందూ రాజ్యం అంటూ ఏర్పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాల భౌతిక అవసరాలను పట్టించుకోకుండా బేఖాతరుగా వ్యవహరిస్తున్నదే అప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారిక విధానం అయిపోతుంది. అలా వ్యవహరించాలంటే అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా నియంతృత్వ ప్రభుత్వమే అయి వుండాలి. అది ప్రజల్లో భయో త్పాతాన్ని సృష్టించేది అయి వుండాలి.
ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా, అది ఆస్తిపర వర్గాల నాయకత్వంలో నడిచేది అయితే అక్కడ శ్రామిక వర్గం మీద పెట్టుబడిదారులు సాగించే వర్గ నియంతృత్వ పాలనే ఉంటుంది (దానర్ధం ప్రజాస్వామిక ప్రభుత్వానికి, నియంతృత్వ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు అని మాత్రం కాదు సుమా). ప్రజాస్వామ్య ప్రభుత్వమే అలా వ్యవహరించేటప్పుడు, ఇక సామాన్య ప్రజల పరిస్థితులు నానాటికీ దిగజారిపోతూ, వాటి గురించి ఏ మాత్రమూ పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్టుబడిదారీ వర్గం ప్రభుత్వం మీద తన పట్టు బిగించాలనుకుంటే ప్రజల హక్కుల్ని కాలరాయకా తప్పదు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కొరగాకుండా చేయనూ తప్పదు.
గుత్త పెట్టుబడి ఆధ్వర్యంలో వ్యవహరించే ఒక వర్గ నియంతృత్వ సాధనంగా హిందూ రాజ్యం ఉంటుంది. ఇప్పుడు ఆ గుత్త పెట్టుబడిదారీ వర్గం నయా ఉదారవాద చట్రంతో మమేకమైపోయింది. ఇది శ్రామిక ప్రజల జీవితాలను మరింత దిగజారుస్తుంది. ఇప్పుడు ఆ నయా ఉదారవాద వ్యవస్థే మొత్తంగా సంక్షోభంలో కూరుకుపోయింది. అందుచేత తన పెత్తనాన్ని నిలబెట్టుకోడానికి అది నియంతృత్వంగా వ్యవహరించడం అనివార్యం, భయోత్పాతంతో సామాన్య ప్రజానీకాన్ని అదుపు చేయబూనుకోవడమూ అనివార్యం. హిందూ రాజ్యం ఏర్పడితే జరిగేది ఇదే.
హిందూ రాజ్యం ఏర్పరచాలనే ప్రాజెక్టుకు దాదాపుగా గుత్త పెట్టుబడిదారీ వర్గం యావత్తూ తమ మద్దతును ప్రకటించడం ఇందుకే. ఇక భయోత్పాతం సృష్టించడం అనేది మత ఘర్షణలను రెచ్చగొట్టడం, ఒక మతానికి చెందిన ప్రజలను మెజారిటీ మతస్తుల దృష్టిలో ”శత్రువులు”గా, మన దేశానికి చెందని ”బైటవారు”గా చిత్రించే ప్రచారం చేయడం, వారిపై ద్వేషభావాన్ని రెచ్చగొట్టేవిధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వంటి రూపాలతో మొదలౌతుంది. హిందూ రాజ్యం అనేది ఈ ప్రక్రియను మరింత బలపరుస్తుంది.
”హిందూ ఆధిక్యత” అనే భావాన్ని, మరోపక్క భయోత్పాతాన్ని పెంచడంతోబాటు మూడవ పార్శ్వం కూడా హిందూ రాజ్యం చేపడుతుంది. సామాజిక అభివృద్ధి నిరోధక మార్పులను తీసుకురావడమే ఆ మూడవ పార్శ్వం. 20వ శతాబ్దంలో మనం రెండు సమాంతర ఉద్యమాలను చూశాం. ఒకటి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాగా రెండవది కులాధిపత్య ప్రాతిపదికన నడిచిన భూస్వామ్య సమాజంలో వేల సంవత్సరాలపాటు అణచివేతకు, వివక్షకు గురైన సామాజిక తరగతుల విముక్తి కోసం సాగిన ఉద్యమం. మొదటి ఉద్యమంలో పాల్గొన్న వారందరూ రెండవ ఉద్యమానికి సానుభూతిగా వ్యవహరించారని చెప్పలేం కాని, ఈ రెండు ఉద్యమాలూ ఒకదానిని ఇంకొకటి బలోపేతం చేశాయి. సాధారణ ప్రజానీకం రెండింటినీ వేరు వేరుగా చూడలేదు. అలా రెండింటి మధ్యా సమన్వయ సంబంధం సాధించడంలో వామపక్ష శక్తులు కీలక పాత్ర పోషించాయి.
ఈ జంట ఉద్యమాల ఫలితంగా దేశంలో చాలా పెద్ద సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులు సంపూర్ణమైనవీ కావు, సమగ్రమైనవీ కావు. అవి బూర్జువా చట్ర పరిమితుల వరకే జరిగాయి. వాటిని దాటి ముందుకు పోలేకపోయాయి. అయినప్పటికీ జరిగిన మార్పు, పురోగతి గణనీయమైనది. అది ముఖ్యమైన ఒక ముందడుగు. దాని ప్రాముఖ్యతను ఒకే ఒక్క ఉదాహరణతో వివరిస్తాను.
20వ శతాబ్దం ప్రారంభంలో కేరళ ప్రాంతంలో అస్పృశ్యతతో బాటు ”కంట పడకూడని” ఆచారం కూడా ఉండేది. అంటే ఒక అగ్ర కులస్తుడు ఒక తక్కువ కులస్తుడిని చూస్తే చాలు. అతడు మైలపడి పోతాడన్నమాట. అందుచేత అగ్రకులస్తుల కంటబడకుండా మెలగవలసిన బాధ్యత ఆ తక్కువ కులస్తులదే. అటువంటి స్థితిలో ఉండిన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు మానవాభివృద్ధి సూచికలను పరిశీలిస్తే తక్కిన రాష్ట్రాల కన్నా, చాలా మూడవ ప్రపంచ దేశాల కన్నా మెరుగుగా ఉన్నాయి. కొన్ని విషయాలలో అభివృద్ధి చెందిన దేశాల సూచికలతో పోల్చదగ్గ స్థాయిలో ఉన్నాయి. అంటే సామాజిక మార్పు ఏ స్థాయిలో జరిగిందో మనం ఊహించవచ్చు. కేరళలో జరిగినంత స్థాయిలో కాకపోయినా, దేశంలో తక్కిన ప్రాంతాలలో కూడా సామాజిక పురోగతి తరతమ తేడాలతో కొనసాగింది.
ఇప్పుడు హిందూత్వ భావజాలం పైచేయి సాధించింది. దాని వెనుక అంతర్లీనంగా హిందూత్వ శక్తులు ఇచ్చిన హామీ ఒకటుంది. రాజకీయ, సామాజిక రంగాల్లో సాధించిన పురోగతిని ఆపి వెనక్కి తిప్పుతామన్నదే ఆ హామీ. అది నెరవేరడానికి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయడం చాలా అవసరం. రాజకీయంగా, సామాజికంగా వెనక్కి పోయే క్రమంలో లౌకిక తత్వాన్ని బలహీనపరచం ఒక్కటే చర్య కాదు. హిందూత్వ ఆధ్వర్యంలో అమలు జరిగే నయా ఉదారవాద విధానాలు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం కూడా ఒకటి. అదే విధంగా విద్యా విధానంలో తెస్తున్న మార్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి సమాజంలో వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి రంగాల్లో ఉన్న అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి. ఇంతవరకూ జరుగుతున్న పురోగతి ఇప్పుడు వెనుక పట్టు పడుతోంది. దీనినే మనం సామాజిక తిరోగమనం అని అంటాం.
మాటలు ఒక్కోసారి చాలా మోసం చేస్తాయి. ఈ విషయంలో హిందూ రాజ్యానిది అందె వేసిన చెయ్యి. హిందూ రాజ్యం గురించి హిందూత్వ శక్తులు చేసే ప్రచారం ప్రకారం హిందూ రాజ్యం గనుక ఏర్పడితే అది హిందువుల విముక్తికి దారి తీస్తుంది. కాని వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. హిందూ రాజ్యం అనేది నయా ఉదారవాద చట్రంలో గుత్త పెట్టుబడిదారీ శక్తులు సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థలో తమ స్వంత ప్రయోజనాలను కాపాడుకోడానికి ఉపయోగించే సాధనం. ఇది ఒక సామాజిక తిరోగమనానికి దారి తీసే రాజ్యం అవుతుంది. గత శతాబ్ద కాలంగా సాధించుకున్న విజయాలన్నింటినీ తిరగదోడి మళ్ళీ వెనక్కి సామాన్య ప్రజల్ని నెట్టివేస్తుంది. ఈ హిందూ రాజ్య స్థాపనను అడ్డుకోడానికి రైతాంగంతో కలిసి ఉద్యమించవలసిన చారిత్రిక కర్తవ్యం కార్మికవర్గం భుజ స్కందాలపై ఉంది.
(స్వేచ్ఛానుసరణ)

– ప్రభాత్‌ పట్నాయక్‌

➡️