ఉన్నత విద్య అందని ద్రాక్షే…!

కళాశాలలకు దూరమవుతున్న ముస్లిం మైనారిటీలు

సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం

కానరాని ప్రభుత్వ మద్దతు

ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే బెటర్‌

న్యూఢిల్లీ   :    ముస్లిం మైనారిటీలు క్రమేపీ ఉన్నత విద్యకు దూరమైపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ‘భారత్‌లో ముస్లింల విద్య’ అనే అంశంపై జరిపిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. 2020-21, 2021-22లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో…

2016-17లో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 17,39,218 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశం పొందారు. వీరి సంఖ్య 2019-20 నాటికి 21,00,860కి పెరిగింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 8.53% తగ్గింది. అంటే 1,79,147 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్న మాట. 18-23 సంవత్సరాల మధ్య వయసున్న ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) జాతీయ సగటు 8.41%. వీరిలో పురుషుల (8.44%) కంటే మహిళలే (9.43%) ఎక్కువగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణలోనూ, కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ముస్లిం విద్యార్థుల జీఈఆర్‌ అధికంగా ఉంది. ఇందులో తెలంగాణ 34% జీఈఆర్‌తో అగ్రస్థానంలో ఉండగా 28% జీఈఆర్‌తో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. అక్షరాస్యతకు నిలయమైన కేరళలో 20% ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కర్నాటక 15.78% జీఈఆర్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేవలం 10% ముస్లిం విద్యార్థులు మాత్రమే కళాశాలలకు వెళుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 9.56% మంది ముస్లిం జనాభా ఉంది. దక్షిణాదిలోని కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే పాండిచ్చేరిలో 25% మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. లక్షదీవుల జనాభాలో 96% మంది ముస్లింలే అయినప్పటికీ అక్కడ 4% మంది మాత్రమే కళాశాలలకు వెళుతున్నారు.

ఉత్తరాదిలో…

ఉత్తరాదిలోని హిందీ ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీలో సగటున సుమారు 7% మంది ముస్లిం విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది 12 శాతం పాయింట్లు తక్కువ. జార్ఖండ్‌ (15%), ఉత్తరాఖండ్‌ (12.48%) రాష్ట్రాలలో మాత్రమే ముస్లిం విద్యార్థులు రెండంకెల సంఖ్యలో కళాశాలలకు వెళుతున్నారు. యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో 13%కి పైగా ముస్లిం మహిళా విద్యార్థులు కాలేజీలలో ప్రవేశం పొందారు. హిందీ రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే అధికం. ఢిల్లీలో 7.09%, ఛత్తీస్‌గఢ్‌లో 7%, మధ్యప్రదేశ్‌లో 6.57%, బీహార్‌లో 6.13%, ఉత్తరప్రదేశ్‌లో 5.43%, రాజస్థాన్‌లో 5.08%, హర్యానాలో 4.49% ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

సామాజిక, ఆర్థిక సూచికల్లో వ్యత్యాసాలే కారణం

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల సామాజిక, ఆర్థిక సూచికల్లో వ్యత్యాసాలు ఉన్నాయని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ముస్లిం యూనివర్సిటీ (మనూ) ప్రొఫెసర్‌ కేఎం జియాయుద్దీన్‌ చెప్పారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. చాలా కాలం క్రితమే కర్నాటకలో రిజర్వేషన్‌ విధానం అమలులోకి వచ్చిందని, ఈ విధానం కారణంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని వివరించారు. ఈ రాష్ట్రాలలో పాఠశాలలు, కళాశాలల సంఖ్య కూడా ఎక్కువేనని అన్నారు. విద్యా నాణ్యత, పర్యవేక్షణ సైతం మెరుగ్గానే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలలో మైనారిటీల పట్ల వివక్ష లేదని, అక్కడ వారు సురక్షితంగా ఉంటారని ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. అక్కడి సమాజాలలో అంతర్గత కూర్పు సమతూకంగా ఉంటుందని అన్నారు. హిందీ ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడానికి అక్కడ నెలకొన్న రాజకీయ వాతావరణం కూడా కారణమేనని వివరించారు.

ఇవీ కారణాలే

కళాశాలల్లో ముస్లిం విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడానికి మరికొన్ని కారణాలు కన్పిస్తున్నాయి. వారికి బ్యాంకుల నుండి మద్దతు తక్కువగా ఉంటుంది. రుణాలు లభించవు. ఆదాయాలు తక్కువగా ఉండడం, ఆస్తులు లేకపోవడం, మనుగడ కోసం తాపత్రయ పడాల్సి రావడం వల్ల ఉన్నత విద్యలో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీల కోసం పథకాలనైతే ఆర్భాటంగా ప్రకటిస్తాయి కానీ వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్చే ఆర్థిక స్తోమత మైనారిటీలకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం లభించకపోతే చదువుకు స్వస్తి చెప్పాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ విద్య తర్వాత ముస్లిం విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుకు గుడ్‌బై చెబుతున్నారు. కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌లో 20%కి పైగా డ్రాపవుట్లు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌, హర్యానా, యూపీలో కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉంది. పులి మీద పుట్రలా 2022-23 నుండి మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మైనార్టీలను వేధిస్తున్న పాలకులను ఓడించి ప్రగతిశీల శక్తులను గెలిపించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కోరుతున్నారు.

➡️