Hemant Soren: కేసులో మరొకరు అరెస్టు

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు వ్యతిరేకంగా మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరొకరిని అరెస్ట్‌ చేసింది. లాండ్‌ స్కాంకి సంబంధించిన మరో మనీలాండరింగ్‌ కేసులో అఫ్షర్‌ అలీ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. కోర్టు అనుమతితో ఇడి అతనిని కస్టడీలోకి తీసుకుందని పేర్కొన్నాయి. ప్రధాన నిందితుడు సోరెన్‌, మాజీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ భాను ప్రతాప్‌ ప్రసాద్‌ పట్ల అండదండలతో భూమిని ఆక్రమించుకునేందుకు అఫ్షర్‌ అలీ ఫోర్జరీకి పాల్పడ్డారని ఇడి పేర్కొంది. ఈ కేసులో ఇది నాలుగవ అరెస్ట్‌. రాంచీలో అంటు టిర్కీ అనే వ్యక్తికి చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు కూడా జరిపినట్లు ఆ అధికారులు తెలిపారు. జెఎంఎం అధినేత, జార్ఖండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరిలో ఇడి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన భాను ప్రతాప్‌ ప్రసాద్‌, మహమ్మద్‌ సద్దామ్‌ హుస్సేన్‌ కూడా ఇదే జైలులో ఉన్నారు.

➡️