వెన్నువిరిగిన అన్నదాత!

Dec 5,2023 09:23 #heavy rains, #Tufan
  • ‘మిచౌంగ్‌’ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు
  • తడిచిన ధాన్యం, వరి పనలు, నేలకొరిగిన చేలు

ప్రజాశక్తి- యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో కుండపోత వర్షం పడింది. తుపాను గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఈదురు గాలులు, వర్షాలకు వరి చేలు నేలకొరగడం, ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో అన్నదాత వెన్ను విరిగింది. పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో అంధకారం నెలకొంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల జిల్లాలో కోత కోసి పొలాల్లో ఆరబెట్టిన వరి పనలు తడిచిపోయాయి. కోతకు వచ్చిన వరి చేలు ఈదురు గాలుల వల్ల నేలకొరిగాయి. ఏలూరు జిల్లాలో 1,93,398 ఎకరాల్లో వరి సాగు కాగా, ఇప్పటి వరకూ 89,542 ఎకరాల్లోనే (45 శాతం), పశ్చిమగోదావరి జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఇప్పటి వరకూ 30,600 ఎకరాల్లో (35 శాతం) మాత్రమే కోతలు, నూర్పులు పూర్తయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో సుమారు 60 శాతం పంట పొలాల్లోనూ, కళ్లాలోనూ ఉంది. నూర్పులు చేసిన ధాన్యాన్ని రోడ్లపైనా, కళ్లాలోనూ ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లాలో 31 వేల టన్నుల ధాన్యాన్ని కళ్లాలో ఆరబెట్టారు. వీటిపై కప్పిన తార్పాలిన్లు ఈదురు గాలులకు ఎగిరిపోయి ధాన్యం తడిసి ముద్దవుతోంది. కోత కోయని పొలాల్లోని వరి చేలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో కళ్లాల్లో 1.70 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ధాన్యాన్ని కళ్లాల వద్దే ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈదురుగాలులకు తూర్పుగోదావరి జిల్లా పెరవలి, చాగల్లు, కొవ్వూరు రూరల్‌, కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, రాజోలు, మలికిపురం, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి మండలాల్లో వరి చేలు నేలకొరిగాయి. పెరవలిలో అరటి చెట్లు విరిగిపోయాయి.

 

పాప వినాశనం అనుమతి నిలిపివేత

తిరుపతి జిల్లాలో కుండపోత వర్షం ఆగకుండా పడుతుండడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలుచోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. తిరుమల ఘాట్‌లో పొగమంచు వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే వాహనాలను అనుమతిస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. బాలాయపల్లి మండలం పిగిలాం గ్రామంలో రామకృష్ణయ్యనాయుడుకు చెందిన షెడ్డు కూలడంతో ఆయనకు చెందిన నాలుగు దూడలు మృతి చెందాయి.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో డెల్టా ప్రాంతాల్లో పనలపై ఉన్న వరికి తీవ్ర నష్టం వాట్లింది. తెనాలి, పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలోని పలు గ్రామాల్లో వరి పైరు నేలవాలింది. పత్తి పంటకూ నష్టం వాటిల్లింది. జోరు వాన వల్ల పూత, కాయ దెబ్బతింది. తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి నేలరాలిపోతోంది. మిర్చి పైరుకు ప్రస్తుతం వర్షం ఊపిరిపోసింది.

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో నీరు చేరడంతో వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో కోసి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మరో పది రోజుల్లో కోయాల్సిన పంట చేలు నేలకొరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల చిరుజల్లులు పడ్డాయి.

crop damage in bhattiprolu

  • నెల్లూరు జలదిగ్బంధనం

నెల్లూరు నగరం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. జిల్లాలో 38 మండలాలు ఉండగా, వీటిలో పది మండలాల్లో తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం ఒక్క రోజే జిల్లాలో 65.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నెల్లూరులో 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందుకూరుపేటలో 200 మిల్లీమీటర్లు, విడవలూరులో 184, వెంకటాచలంలో 181, కోవూరులో 176, టి.గూడూరులో 162, ముత్తుకూరులో 156, మనుబోలులో 150, కొడవలూరు 132, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులోని గాంధీ గిరిజన కాలనీలో సిపిఎం నాయకులు పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

  • పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు

చేపల వేటపై జీవించే తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అంబలపూడిలోని గిరిజనులను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసంలో ఉంచారు. ఆదివారం రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయకపోవడంతో వస్తు ఉండాల్సి వచ్చింది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు చలికి గజగజ వణుకుతున్నారు.

  • ఎగిసి పడుతున్న అలలు

అలల ఉధృతికి ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో పల్లెపాలెం వద్ద సముద్రం కోతకు గురైంది. విశాఖ నగరంలోనూ, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోనూ సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు సమీపంలోని తూపిలిపాలెం వద్ద సముద్రం 30 మీటర్ల ముందుకు వచ్చింది.

  • పలు విమానాలు రద్దు

విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి పలు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం -తిరుపతి, తిరుపతి -విజయవాడ, విశాఖపట్నం -విజయవాడ, విశాఖ-చెన్నరు, హైదరాబాద్‌ -విశాఖపట్నం ఫ్లైట్స్‌ అన్నీ పూర్తిగా రద్దయ్యాయి. మంగళవారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. రేణిగుంట విమానాశ్రయంలో 15 విమాన సర్వీసులను రద్దు చేశారు.

తెలంగాణలో…తెలంగాణ రాష్ట్రంలోని ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడ్డాయి.

➡️