భారీగా మద్యం పట్టివేత

Apr 6,2024 23:18 #alcohol, #seaze

ప్రజాశక్తి – మునగపాక, తిరువూరు:గోవా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న మద్యం నిల్వలను అనకాపల్లి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలి సిఐ గఫూర్‌ కథనం ప్రకారం.. అక్రమ మద్యం రవాణా విషయం ఎస్‌ఐ ప్రసాదరావుకు తెలియడంతో ఆయన స్థానిక పోలీసులతో కలిసి మునగపాక మండలంలోని యాదగిరిపాలెంలో మాటు వేశారు. అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్‌ సైకిళ్లపై కొన్ని వస్తువులను తీసుకు వెళ్తుండగా వారిని అడ్డగించారు. వారి వద్ద ఉన్న లగేజీలను తనిఖీ చేయగా ఐదు కేసుల మద్యం బాటిళ్లు లభించాయి. అనంతరం వారిని విడివిడిగా విచారించగా యలమంచిలి మండలంలోని సోమలింగపాలెం గ్రామంలో ముద్దాయిల పశువుల పాకలోగల గడ్డివాములో దాచిపెట్టిన రూ.49.35 లక్షలు విలువ చేసే 39,168 బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను మరింత లోతుగా విచారిస్తున్నారు.
ఎన్‌టిఆర్‌జిల్లా తిరువూరు, ఏ.కొండూరు మండలాల్లో నాటు సారా, బెల్టు షాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేశారు. తిరువురులోని బోయబజారులో నల్లబోతుల స్వాతి వద్ద ఉన్న 23 డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాల్టీయా తండాలో ఓ వ్యక్తి వద్ద ఉన్న ఐదు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు.

➡️