ఎండల్లో దండెత్తే ఆరోగ్య సమస్యలు

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో అనేక మార్పులు సంభవించి చివరకు అనారోగ్యానికి దారి తీయొచ్చు. తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, వడదెబ్బ, మీజిల్స్‌, కామెర్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎండాకాలంలో తలెత్తుతాయి. ఎండల ఉధృతి ఉండే మార్చి – జూన్‌ నెలల మధ్య కొన్ని రకాల వైరస్‌ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవిలో కలిగే అనారోగ్యాలు
వడదెబ్బ : ఎండలో ఎక్కువగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా, అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చెమట పట్టకపోవటం, కాళ్ళూ చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహ కోల్పోవటం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబర్చాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం ఉత్తమం.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే తరచూ నీటిని తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, గ్లూకోజ్‌ డి వంటివి తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్‌ ఫౌడర్‌ లేదా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తీసుకోవొచ్చు.

చికెన్‌పాక్స్‌ : చికెన్‌ పాక్స్‌ (అమ్మోరు) వేసవి వ్యాధుల్లో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపురంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. పిల్లల్లో, తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి.

తట్టు : మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సో వైరస్‌ వేసవిలో వేగంగా పెరుగుతుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, తరువాతి దశలో చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్‌ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనపడ్డ వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కామెర్లు : ప్రధానంగా కలుషితమైన ఆహారం, నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది.

టైఫాయిడ్‌ : అపరిశుభ్ర ఆహారం, కలుషిత నీరు తీసుకోవటం వల్ల టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. టైఫాయిడ్‌ వస్తే బలహీనత, ఆకలిలేకపోవటం, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

గవదబిళ్ళలు : వేసవిలో ప్రబలే అంటు వ్యాధి ఇది. ఇది సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథివాపు, కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి.

విషాహారం : వేసవిలో అధిక వేడికారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే ప్రమా దం ఉంది. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలి.

అతిసారం : ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే విరోచనాలు సాధారణం. కలుషిత ఆహారం తినటం, మద్యపాన అలవాట్లు డయేరియాకు దారి తీస్తాయి. అతిసారం నుంచి దూరంగా ఉండటానికి నీటిని మరిగించిన తర్వాత మాత్రమే తాగటం అలవాటుగా చేసుకోవాలి. కూరగాయలను ముక్కలుగా చేయటానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి.

చర్మ సమస్యలు : వేసవిలో సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఏర్పడే ఎరుపు దద్దుర్లు, స్వేద గ్రంథులు మూసుకుపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చెమట వల్ల మచ్చలు, దురద మంట వస్తుంది. వేసవిలో తప్పకుండా సన్‌స్క్రీన్‌ లోషన్లు ఉపయోగించాలి. ఎండలకు శరీరం ఫోకస్‌ కాకుండా చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి…
ఎండాకాలంలో వడగాల్పులు అనేక ఇబ్బందులకు గురిచేస్తాయి. అందువల్ల కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

  • దాహం వేసినా, వేయకున్నా గంటకొకసారి మంచినీటిని తాగుతుండాలి. అప్పుడప్పుడూ మజ్జిగ, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
  •  శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోకూడదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. వాటిల్లోని రసాయనాల వల్ల బరువు పెరగటంతోపాటు జీర్ణ సంబంధ సమస్యలూ ఎదురుకావొచ్చు.
  •  మసాలా పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆకుకూరలు, మల్లంగి, బీట్‌రూట్‌, సొరకాయ, టమోటా, దోసకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి
  •  డ్రైఫ్రూట్స్‌ తగ్గించి వీలైనంతవరకూ తాజా పండ్లు తీసుకోవాలి.
  •  పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి
  •  ఇంట్లో తయారుచేసుకునే ప్రతి పానీయంలోనూ సబ్జా గింజలను నానబెట్టి వాడితే మంచిది.
  •  పండ్ల రసాలు కూడా అప్పటికప్పుడు తాజాగా చేసుకోవాలి. చక్కెర శాతాన్ని వీలైనంతవరకూ తగ్గించాలి.
  •  నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పుదీనా రసం, పల్చని మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే శరీరానికి తేమ అందుతుంది. డీహైడ్రేషన్‌ సమస్య కూడా ఎదురుకాదు.
  •  ఎక్కువగా నూనె ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కుదిరితే ఈకాలంలో పూర్తిగా మానేయటం మంచిది.
  •  మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండాలి
  •  కాటన్‌ దుస్తులు ధరించాలి
  •  ఎండకు బయటకు వెళ్లినప్పుడు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవటం మంచిది
  •  నలుపు రంగు గొడుగులను వాడకూడదు
  •  వృద్ధులు, పిల్లలు, ఐదేళ్లలోపు వారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
  •  అనారోగ్య సమస్యలతో ఉన్న వారు మందులు వాడి ఎండలో పనిచేస్తే వడదెబ్బ తగులుతుంది
  •  రక్షిత మంచినీటినే తాగాలి. కలుషిత నీటిని తాగొద్దు.
  •  మద్యం సేవించొద్దు
  •  ఉదయం 10లోపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బయట పనులు చేయటం మంచిది
  •  గృహాల్లో మంచి గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాటుచేసుకోవాలి.
➡️