హెడ్‌, షాబాజ్ వీరవిహారం..

Apr 21,2024 08:27 #Delhi, #ipl 2024, #Sports, #SRH
  • 6ఓవర్లలో 125పరుగులు కొట్టిన సన్‌రైజర్స్‌
  • మూడో రికార్డు స్కోర్‌ నమోదు

న్యూఢిల్లీ: చిన్నస్వామిలో బెంగళూరు బౌలర్లను ఉతికేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఈసారి ఢిల్లీ గడ్డపై సిక్సర్ల మోత మోగించారు. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌(89), షాబాజ్ అహ్మద్(59నాటౌట్‌), అభిషేక్‌ శర్మ(46)లు సునామీలా విరుచుకుపడ్డారు. దాంతో, హైదరాబాద్‌ 7 వికెట్ల నష్టానికి 266 రన్స్‌ కొట్టింది. హెడ్‌, అభిషేక్‌ ఊచకోతతో 3 ఓవర్లకే స్కోర్‌ 32.. ఆరు ఓవర్లకు 125.. ఇలా రాకెట్‌ వేగంతో పరుగులు తీసింది. దాంతో, కమిన్స్‌ సేన అలవోకగా 300 కొడుతుందనిపించింది. అయితే.. పవర్‌ ప్లే తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ తిప్పయడంతో స్కోర్‌ తగ్గినా.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి(37), షాబాజ్  ధనాధన్‌ ఆడి రెండొందలు దాటించారు. చివర్లో అబ్దుల్‌ సమద్‌(13) మెరుపులతో హైదరాబాద్‌ భారీ టార్గెట్‌ నిర్దేశించింది. ఐపీఎల్‌ అత్యధిక స్కోర్‌ను రెండుసార్లు బద్ధలు కొట్టిన హైదరాబాద్‌ బ్యాటర్లు ఈసారి కూడా చితక్కొట్టారు. ప్రత్యర్థి మారినా తమ ఆట ఇదేనంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. దాంతో, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు తాము ఎంతపెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌(89), అభిషేక్‌ శర్మ(46) లు వీరకొట్టుడుకు బంతి బౌండీరీల వెంట పరుగు తీసింది. ఈ క్రమంలో హెడ్‌ కేవలం 16 బంతుల్లోనే అర్థ శతకం నమోదు చేశాడు. అభిషేక్‌ సైతం సిక్సర్లతో హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. కుల్దీప్‌ యాదవ్‌ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దాంతో, 131 పరుగుల వద్ద తొలి వికెట్‌ లబించడంతో ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకుంది.

నితీశ్‌, షాబాజ్  దంచగా..
అభిషేక్‌ తర్వాత వచ్చిన ఎడెన్‌ మర్క్‌రమ్‌(1), క్లాసెన్‌(15)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, ఒక్కసారిగా ఆరెంజ్‌ ఆర్మీ స్కోర్‌ తగ్గిపోయింది. అయితే.. నితీశ్‌ రెడ్డి(37), షాబాజ్ అహ్మద్‌(11)లు ధనాధన్‌ ఆడి ఐదో వికెట్‌కు 67 రన్స్‌ జోడించారు. నితీశ్‌ ఔటైనా షV్‌ాబాజ్‌ బౌండరీలతో చెలరేగి ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆఖరి ఓవర్లో అతడు బౌండరీ, సిక్స్‌ బాదడంతో హైదరబాద్‌ 7 వికెట్ల నష్టానికి 267 రన్స్‌ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ (4/55)నాలుగు వికెట్లతో రాణించాడు.

పవర్‌ ప్లేలో రికార్డు స్కోర్‌…
ఐపిఎల్‌ చరిత్రలో రికార్డు స్కోర్‌లు నమోదు చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌ పవర్‌ ప్లే(6ఓవర్లు) ముగిసేసరికి రికార్డు స్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌(89), అభిషేక్‌ శర్మ(46) సునామీలా విరుచుకుపడడంతో 36బంతుల్లోనే 125 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు అనూహ్యంగా పైచేయి సాధించి కీలక వికెట్లు తీశారు. దాంతో హైదరాబాద్‌ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక బెంగళూరుపై సెంచరీ బాదిన హెడ్‌ కేవలం 16 బంతుల్లోనే అర్థ శతకం నమోదు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ ప్లే 6ఓవర్లలో సన్‌రైజర్స్‌ జట్టు ఏకంగా 125పరుగులు చేసింది. దీంతో 2017లో కోల్‌కతా జట్టు బెంగళూరుపై కొట్టిన 105పరుగుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే ఓ పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్‌గా ట్రివిస్‌ హెడ్‌(84; 26బంతుల్లో) రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు హైదరాబాద్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌(62పరుగులు, 25బంతుల్లో) కోల్‌కతాపై బ్రేక్‌ చేశాడు. అభిషేక్‌ సైతం ధాటిగా ఆడినా కుల్దీప్‌ యాదవ్‌ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దాంతో, 131 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. ఆ తర్వాత వచ్చిన ఎడెన్‌ మర్క్‌రమ్‌(1), క్లాసెన్‌(15)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో మరోసారి రికార్డు స్కోర్‌ నమోదు చేస్తుందన్న అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.

➡️