విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

sitaram yechury on lenin 100th death anniversary seminar
  • మోడీపై చర్యలు తీసుకోండి
  •  ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ

న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను ఆయనపై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు రెండు రోజుల క్రితం ఒక లేఖ రాశారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రసంగాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అయోధ్యలో రామాలయంలో జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని గురించి ఆయన దాదాపు తన ప్రతి ప్రసంగంలోనూ ప్రస్తావిస్తూనే వున్నారని, ఈ విషయమై కొన్ని ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లే యత్నం చేస్తున్నారని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలను రామాలయ వ్యతిరేకులుగా చిత్రించడం, రాముడికి వారు వ్యతిరేకులని, రాముడిని అవమానిస్తున్నారని అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నార,.ఈ నెల 7న బీహార్‌లోని నవడాలో, 9న యుపిలోని ఫిలిబిత్‌లో మోడీ చేసిన ప్రసంగాలను, సంబంధిత వీడియో లింక్‌లను రెండు భాగాలుగా ఈ లేఖతో జతచేసి పంపామని ఏచూరి తెలిపారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ నెల 6న మోడీ ప్రసంగిస్తూ, రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు వచ్చే రామనవమి ఉత్సవాలను కూడా వ్యతిరేకిస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మత భావాలను రెచ్చగొట్టే యత్నం తప్ప ఇది మరొకటి కాదని ఏచూరి పేర్కొన్నారు. (ఈ ప్రసంగానికి సంబంధించి ముఖ్య భాగాలు మొదటి అనుబంధంలో జోడించారు).
మోడీ చేసిన ఈ ప్రసంగాలు ఎన్నికల నియమావళిని బాహాటంగా ఉల్లంఘించేలా ఉన్నాయి. జనరల్‌ కండక్ట్‌ సెక్షన్‌లోక్లాజ్‌ 1, 3లను కూడా ఇవి అతిక్రమిస్తున్నాయి. బిజెపికి మద్దతును సమీకరించడానికి లేదా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడానికి రామాలయాన్ని, రాముడిని ఉపయోగించడమనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఆ లేఖ పేర్కొంది. మార్చి 1న రాజకీయ పార్టీలకు సూచనలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా మోడీ ఖాతరు చేయడం లేదని ఏచూరి విమర్శించారు.
‘రామాలయాన్ని ద్వేషించే వారికి ఆశ్రయం ఇస్తున్నాయి’, ‘రాముడిని అవమానిస్తున్నారు’, రామనవమి ఉత్సవాలను వ్యతిరేకించే వారిని హెచ్చరిక అంటూ మోడీ కొన్ని ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వ్యాఖ్యలు, ఉద్దేశిత లక్ష్యానికి వ్యతిరేకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించబడ్డాయని స్పష్టమవుతోంది. అలాగే ఈ చర్యలు చట్టానికి విరుద్ధంగా వుంటున్నాయి.
పైగా ఐపిసిలోని సెక్షన్‌ 153ఎ, సబ్‌ క్లాజ్‌ (ఎ), (బి), ఐపిసి సెక్షన్‌ 505, సబ్‌ సెక్షన్‌ 2 నిబంధనలు వర్తిస్తాయి. అలాగే, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్‌ క్లాజ్‌ 3, 3ఎ నిబంధనలు కూడా ఈ ప్రసంగాలకు విర్తస్తాయి.
అత్యున్నత పదవిలో వున్న వ్యక్తి, పైగా పాలక పార్టీ ఉన్నత స్థాయి నేత ఇటువంటి విచ్ఛిన్నకరమైన, నిరాధారమైన ప్రసంగాలు చేయడం తీవ్ర దురదృష్టకరమని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను సిపిఎం కోరుతోంది. దీనితో ప్రమేయం వున్న వ్యక్తి హౌదాతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా చట్టాన్ని వర్తింపచేయాలని కోరింది. ఎన్నికల వాతావరణాన్ని మరింత విషపూరితం చేయకుండా నిలువరించేందుకు ఎన్నికల కమిషన్‌ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఏచూరి ఆ లేఖలో కోరారు.

➡️