విద్వేషం మరోస్థాయికి చేరింది

Apr 22,2024 20:01 #PM Modi
  • మోడీపై తొలిసారి అకాలీదళ్‌ విమర్శలు

అమృత్‌సర్‌ : రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిరోమణి అకాళీదళ్‌ (ఎస్‌ఎడి) (బాదల్‌) కూడా ఈ విషయంలో ప్రధాని మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఎడి (బి) మోడీపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాజస్థాన్‌లో మోడీపై వ్యాఖ్యలపై ఎస్‌ఎడి తీవ్రంగా స్పందిస్తూ ‘విద్వేషం మరోస్థాయికి చేరింది’ అని విమర్శించింది. ‘భారత్‌ ఎప్పుడూ కూడా ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా’ ఉండాలి. కానీ మనందరి తప్పు ఏమిటంటే… మనకు ఏదైనా వ్యతిరేకంగా జరిగినప్పుడు మాత్రమే మనం అన్యాయం గురించి ఆలోచించడం. ఈ రోజు వాళ్లయితే.. రేపు మనం’ అని తెలిపింది. మోడీ వ్యాఖ్యలు చాలా అవమానకరం, ఆందోళనకు గురిచేసేవి అని విమర్శించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఎస్‌ఎడి (బి) అధికార ప్రతినిధి పరంబన్స్‌ సింగ్‌ రోమన పోస్ట్‌ చేశారు. మాజీ మంత్రి, ఎస్‌ఎడి(బి) నాయకులు బిక్రామ్‌ సింగ్‌ మజితై కూడా ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీ గురునానక్‌ దేవ్‌ జీ మానవులందరినీ సమానంగా చూడాలని, ‘సర్బత్‌ ద భలా’ అంటూ అందరికీ మేలు చేయాలని బోధించారు. ప్రజలందరీని సమానంగా చూసే ఎస్‌ఎడి(బి) ఎల్లప్పుడూ మైనారిటీలు, పంజాబ్‌, పంజాబీలకు అండగా ఉంటుంది. ప్రధాని మోడీ నిన్న చేసిన వ్యాఖ్యలు దేశం కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన మన రాజ్యాంగానికి ముప్పు తెచ్చేవిగా ఉన్నాయి. ఇది మన మోడీ జీ ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ అని మజితై ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘మీరు భారతదేశానికి ప్రధానమంత్రి. భారతదేశం లౌకిక దేశం కాబట్టి మీ వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. ఓటర్ల మధ్య విభేదాలు తెచ్చే ఉద్దేశంతోనే మోడీ ప్రవర్తించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మోడీ మాటలు వారు (బిజెపి) ఎన్నికల్లో ఓడిపోతున్నారనే విషయాన్ని సూచిస్తోంది’ అని తెలిపారు.

➡️