ప్రధాని పీఠం మళ్లీ హసీనాకే 

Jan 8,2024 11:06
hasina again pm in bangladesh elections 2024
  • 300 స్థానాలకు గాను 225 స్థానాల ఫలితాల వెల్లడి 
  • అవామీలీగ్‌కు 172శ్రీ 
  • 40 శాతం ఓటింగ్‌
  • 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పు
  • ఎన్నికలు బహిష్కరించిన బిఎన్‌పి

ఢాకా : బంగ్లాదేశ్‌లో 12వ సాధారణ ఎన్నికల్లో ఊహించినట్లుగానే ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ వరుసగా నాలుగోసారి ఘనవిజయం సాధించింది. పధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) ఎన్నికలను బహిష్కరించటంతోపాటు బంద్‌కు పిలుపునివ్వడంతో 40 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. కడపటి సమాచారం అందేటప్పటికి మొత్తం 300 స్థానాలకుగాను 225 స్థానాలకు ఫలితాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 151 స్థానాలు రావాల్సి ఉండగా, అంతకంటే ఎక్కువగానే 172 స్థానాలు అధికార అవామీలీగ్‌ ఇప్పటికే దక్కించుకోవడం గమనార్హం. అవామీలీగ్‌ మిత్రపక్షం జతియా పార్టీకి 8, ఇండిపెండెంట్లకు 46, ఇతరులకు 1 వచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని అమెరికా పరిశీలకులు తెలిపారు. పోలింగ్‌ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణలు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ ప్రారంభం కావటానికి ముందు కొందరు 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పంటించారు. పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత ఢాకాలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని షేక్‌ హసీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు కేంద్రాల్లో పోలింగ్‌ను మొత్తానికే రద్దు చేయటం గమనార్హం. ఛత్తోగ్రామ్‌, జమాల్‌పూర్‌, ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఢాకాలోని హజారీబాగ్‌లో ఒక పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో రెండు పెట్రోల్‌ బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.అధికార అవామీ లీగ్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగా డమ్మీ క్యాండిడేట్లను నిలిపిందనీ, షేక్‌ హసీనా ఉండగా ఎన్నికలు సాఫీగా జరగబోవని బిఎన్‌పి చీఫ్‌, మాజీ ప్రధాని ఖలేదా జియా ఆరోపించారు. అవామీ లీగ్‌ బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు ఐదు సార్లు అధికారాన్ని దక్కించుకున్న పార్టీగా నిలిచింది.

➡️