రాయి దాడి కేసులో ‘బొండా’కు వేధింపులు

Apr 21,2024 00:23 #2024 election, #Atchannaidu, #Bonda Uma
atchannaidu on ycp govt
  •  టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయి దాడి కేసులో తమ పార్టీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కావాలనే వేధిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అధికారుల ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై గవర్నరు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తోపాటు ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై ఆ పార్టీ మాజీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి, పొలిట్‌ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నిల ప్రధాన అధికారికి లేఖలు రాశారు. రాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సారథ్యం వహించి అభాసుపాలయ్యారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. కాపులపై జగన్‌ కక్ష కట్టారని టిడిపి నేతలు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో ఆరోపించారు.
కడప జిల్లాలో శాంతిభద్రతలు లేవు : ఇసికి ఫిర్యాదు
కడప జిల్లాలో శాంతిభద్రతలు లేవని టిడిపి నాయకులు వర్ల రామయ్యతోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు… రాష్ట్ర ఎన్నిల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను శనివారం సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. లింగాల మండలానికి చెందిన టిడిపి సానుభూతిపరులపై వైసిపి నాయకులు అనుచితంగా దాడి చేశారని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన భార్య, కర్ణాటక ఆదాయపు పన్నుల విభాగం అధికారి విజయలక్ష్మిని సస్పెండ్‌ చేయాలని కోరారు. మీనాను కలిసిన వారిలో టిడిపి నాయకులు ఎఎస్‌ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, వల్లూరి కిరణ్‌ ఉన్నారు. డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్న వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు ఆచంట సునీత మరో ఫిర్యాదు చేశారు.
మే ఒకటినే పింఛను ఇవ్వాలి : దేవినేని ఉమా
సామాజిక పింఛన్లు మే ఒకటినే ఇంటింటికి పంపిణీ చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ నెల పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి నిర్లక్ష్యం వల్ల 60 మంది పింఛనుదారులు మరణించారని, బాధ్యత వహిస్తూ సిఎస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️