ఆ చేతుల చేత …

Apr 29,2024 04:50 #laboring life..

చెమట ధారలు కురిసీ కురిసీ మొలకెత్తిన
శ్రమైక జీవన సొగసు చేతులవి..
ఎక్కడ ఏ పని ముస్తాబై మెరిసినా
దాని వెనక ఆ చేతుల స్వేద విన్యాసమే సమస్తం!
ప్రయాణం నరకమైన గుంతల రోడ్లు
ఆ చేతులు తాకగానే ముఖాలకు జలతారు
పులుముకొని పయననానికి సిద్ధమవుతాయి
వాహనాలను గుండెల మీదుగా సంధించిన
బాణాల్లా రివ్వున సాగనంపుతాయి
అందమైన బహుళ అంతస్తుల భవంతులు
ఆ చేతి వేళ్ళలోంచే రూపుదిద్దుకుంటాయి
ప్రతి గదీ ప్రతి వస్తువూ వెనుక
కష్టం, సృజన ఆ చేతులదే!
ఎక్కడైనా సరే పదిచేతులు ఏకమై పరిశ్రమించాయంటే
అక్కడొక స్వర్గం వచ్చి వాలాల్సిందే!
తెల్లారి లేచేసరికి రోడ్డు పక్కనున్న
మురుగుకాల్వ దుర్గంధం పోయి
గలగలా మాట్లాడుతుందంటే రాత్రంతా ఆ చేతులు
నిరంతరంగా యుద్ధం చేయడమే కారణం!
ఎక్కడ ఘర్మజలం ప్రవహిస్తుందో అక్కడ
ఆ చేతులు చిగుర్లు తొడిగి మొక్కయి మానయి
శ్రమశక్తితో ధరణీ మండలాన్ని ధన్యం చేస్తుంది
ఆ చేతుల చలువ వల్లే
మానవుడి జీవిత చక్రం ఆగిపోకుండా
సర్వకాల సర్వావస్థల్లోనూ
నిరాఘాటంగా తిరుగుతూనే వుంటుంది!
– భీమవరపు పురుషోత్తమ్‌
99498 00253

➡️