ప్రభుత్వ విధానాల వల్ల కునరిల్లుతున్న చేనేత రంగం : ముప్పాళ్ళ

  • ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 13వ రాష్ట్ర మహాసభలు

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : దేశంలో వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగమైన చేనేత రంగం ప్రభుత్వాల విధానాల కారణంగా నిరాధారణకు గురై కునరిల్లుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరి మార్కండేయ కళ్యాణమండపంలో రెండు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 13వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చేనేత నాయకులు చిమ్మన నాగభూషణం అందే నరసింహారావుల పేర్లతో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మహాసభలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో సుమారు 7 కోట్ల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ఇటువంటి రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,50,000 మగ్గాలు ఉన్నాయని వీటిపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని ఒక్క మంగళగిరి పట్టణంలోనే 20వేల మగ్గాలు ఉండేవని నేడు అవి వందల సంఖ్యలోకి వచ్చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని ఎన్నికల సమయంలో చేనేత రంగానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరించడమే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలో ఆదరణ పేరుతో సొంత మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు రూ.24 వేలు ప్రభుత్వం అందిస్తుందని అయితే సొంత మగ్గాలు ఉన్న కార్మికులు ఎంతమంది ఉన్నారని అన్నారు. వీరికంటే మగ్గాలు లేని వాళ్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. పొట్టకూటి కోసం నేత నేసే నిజమైన కార్మికున్ని విస్మరించడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. చేనేత రంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా గుర్తిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు దానిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి కేవలం బడ్జెట్లో 200 కోట్లకే పరిమితం చేసిందన్నారు. రాష్ట్రంలోనూ 200 కోట్లకే పరిమితం అవ్వడం శోచనీయమన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి,సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జె.వి.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేనేత రంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడిందన్నారు. చేనేత కళ అనేది నైపుణ్యంతో కూడుకున్న కళ అని ఈ కళను నమ్ముకుని 75 లక్షల మగ్గాలు పని చేస్తున్నాయన్నారు. వస్త్రాన్ని పలుచుగా నేయగల గొప్ప కళ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే ఉందన్నారు. చేనేత కళను పరిరక్షించుకోవడం కోసం అనేక పోరాటాలను నిర్వహించి 11 రకాల రిజర్వేషన్లను సాధించుకోవడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత చేనేత రంగానికి ఉన్న సంస్థలను రద్దు చేశారని అన్నారు. చేనేత రంగానికి సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేవలం 200 కోట్లు కేటాయించారని విమర్శించారు. అవి కూడా మిల్లులకే రాయితీల రూపంలో పోయాయనిఅన్నారు. ప్రతి పౌరుడు రెండు జతల చేనేత వస్త్రాలను కలిగి ఉండాలని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధానమంత్రి మోడీ మాత్రం లక్షలు ఖర్చుపెట్టి లండన్‌ వస్త్రాలు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. చేనేత రంగాన్ని రక్షిస్తున్నామంటూ నినాదాలు చేయడం వాగ్దానాలు ఇవ్వడం కాదని చిత్తశుద్ధితో చేనేత రంగానికి ఉన్న చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను దెబ్బతీసే విధంగా విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్‌ స్కీములను రద్దు చేయడం జరిగింది అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైయస్సార్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.

తొలుత చేనేత కార్మిక సంఘం జెండాను జెవివి సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు.అనంతరం మత వీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ ప్రారంభానికి ముందు ఎన్నారై వై జంక్షన్‌లో ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆల్‌ ఇండియా వివర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్‌, రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్‌, ,చేనేత కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులుకూరపాటి కోటేశ్వరరావు,ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాద్‌ (మణి),సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి నాయకులు చిన్ని సత్యనారాయణ,అన్నవరపు ప్రభాకర్‌, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, చేతి వత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శికే.రామాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు. సభకు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టా హేమ సుందర్‌ రావు,రాష్ట్ర సహాయ కార్యదర్శి పామిశెట్టి గోవిందు, గోట్టిముక్కల లక్ష్మి.అధ్యక్షత వహించగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు వక్తలను ఆహ్వానించారు.

 

➡️