సిబిఐ కస్టడీకి సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌

కోల్‌కతా :    సందేశ్‌ఖలి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ను బెంగాల్‌ పోలీసులు సిబిఐ కస్టడీకి అప్పగించారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం బెంగాల్‌ పోలీసులు షాజహాన్‌తో పాటు సంబంధిత కేసు వివరాలను అందించారు.

సిబిఐ, రాష్ట్ర పోలీస్‌ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను చీఫ్‌ జస్టిస్‌ టి.ఎస్‌. శివజ్ఞానమ్‌ నేతృత్వంలోని కోలక్‌తా హైకోర్టు బెంచ్‌ పక్కనపెట్టి.. ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది.

అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  తక్షణమే కేసు విచారణను చేపట్టాలన్న బెంగాల్‌ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  నిబంధలన ప్రకారం   కోర్టు  నడుచుకుంటుందని, రిజిస్టార్‌ జనరల్‌ ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీని ఆదేశించింది.

సందేశ్‌ఖలి మహిళలపై అత్యాచారం, దహనం, దోపిడీ, హత్యలు, భూములను ఆక్రమించుకోవడం వంటి తీవ్ర అభియోగాలతో 10కి పైగా కేసుల్లో షాజహాన్‌ నిందితుడిగా ఉన్నాడు.

➡️