ఎయిడ్స్ మన చుట్టూనే ఉంది

Mar 31,2024 12:34 #Kakinada

నిరంతర అప్రమత్తత అవసరం

ప్రజాశక్తి-కాకినాడ : మానవ మనుగడలో సహజ విషయమైన లైంగికత ద్వారా వ్యాపించే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని అదుపు చేయడం కష్ట సాధ్యమని రంగరాయ మెడికల్ కాలేజీ మైక్రోబయాలాజీ విభాగ అధిపతి డాక్టర్ పీవీ ప్రసన్న కుమార్ అన్నారు. తన సహాధ్యాయి డాక్టర్ యనమదల మురళీకృష్ణ రాసిన హెచ్ఐవి- ఎయిడ్స్ పుస్తకాన్ని కచేరి పేటలోని లక్ష్మి వైద్యశాలలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో దేశంలోని సగటు కంటే హెచ్ఐవి ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి మారాల్సి ఉందన్నారు. దీనికోసం ఆరోగ్య కార్యకర్తలే కాకుండా బాధ్యత గల పౌరులంతా జన బాహుళ్యంలో ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి కృషి చెయ్యాలన్నారు. పుస్తక రచయిత, సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో తాను ప్రచురించిన ఎయిడ్స్ పుస్తకం 6 ముద్రణలతో 8 వేల కాపీలు ప్రజలకు చేరాయి అన్నారు. ఎయిడ్స్ అవగాహన తరగతులు నిర్వహించే వారికి తన పుస్తకం కరదీపికగా ఉందన్నారు. రెండు దశాబ్దాల కాలంలో ఎయిడ్స్ రంగంలో గొప్ప మార్పులు వచ్చాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి అచ్చంగా హెచ్ఐవి ఫిజీషియన్ గా 23 సంవత్సరాల కాలంలో 6,000 మంది ఎయిడ్స్ రోగులకు వైద్యం అందించానన్నారు. తాను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి నాళ్ళ నుండి ఉపయోగిస్తున్న రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్స ప్రస్తుతం అమెరికా యూరోప్ చికిత్స మార్గదర్శకాలలో భాగమైందన్నారు. హెచ్ఐవి క్షయ వ్యాధిగ్రస్తులలో చెప్పుకోదగ్గ పరిశోధన చేశానన్నారు. లోతైన తన అవగాహనతో పాటు విస్తృతమైన అనుభవాన్ని క్రోడీకరించి పుస్తకం రాశాను అన్నారు. ఎయిడ్స్ రోగులకు మేలు చేసే అటువంటి అంశాలు అన్నింటిని పొందుపరిచి, 23 అధ్యాయాలతో సమగ్రంగా హెచ్ఐవి-ఎయిడ్స్ పుస్తకాన్ని ప్రచురించానని తెలిపారు. ఈ పుస్తకం ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి పేషెంట్లకు భరోసా నింపడానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు.

➡️