నాడు శత్రువులు.. నేడు మిత్రులు

Mar 28,2024 08:27 #Araku, #bjp Candidates, #TDP candidates

ప్రజాశక్తి-సాలూరు : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక నానుడి. అది అక్షరాలా నిజమని తేలింది. ఒకసారి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన నాయకులు తర్వాత ఎన్నికల్లో ఒకే పార్టీలో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడదే జరుగబోతోంది. 2014 ఎన్నికల్లో అరకు ఎంపి అభ్యర్థులుగా వైసిపి నుంచి కొత్తపల్లి గీత, టిడిపి తరపున గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గీత విజయం సాధించారు. తర్వాత కొత్తపల్లి గీత ఎస్‌టి కాదని సంధ్యారాణి కేసు వేశారు. వైసిపి ఎంపిగా విజయం సాధించిన తర్వాత కొన్నాళ్లకు గీత అధికారంలోకి వచ్చిన టిడిపికి అనుకూలంగా పని చేయడం ప్రారంభించారు. ఆ పరిస్థితుల్లో గీతపై వేసిన కేసుని సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి పని చేయాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు ప్రత్యర్థులుగా పోటీ పడిన గీత, సంధ్యారాణి ఇప్పుడు మిత్రులుగా కలిసి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. టిడిపి, జనసేన, బిజెపితో పొత్తులో భాగంగా నియోజకవర్గంలో బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపు కోసం టిడిపి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి పని చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల బిజెపి అరకు ఎంపి అభ్యర్థిగా కొత్తపల్లి గీతని ఖరారు చేసింది. మరోవైపు పదేళ్ల నాటి శత్రుత్వం ఇప్పుడు కూడా వారిద్దరి మధ్య ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గీతపై కుల వివాదం వెంటాడుతున్నా బిజెపి ఆమె పేరునే ప్రకటించింది. గీతని ఎంపి అభ్యర్థి చేయొద్దని టిడిపి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గీత విజయం కోసం సంధ్యారాణి ఏ మేరకు కృషి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

➡️