పెరుగుతున్న విద్వేషం

Feb 28,2024 12:21 #BJP, #growing, #hatred
  • బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే 75 శాతం ఘటనలు
  • ఇండియా హేట్‌ లేబ్‌ నివేదిక

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో 75 శాతం ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు చోటు చేసుకున్నాయని ఇండియా హేట్‌ ల్యాబ్‌ స్పష్టం చేసింది. 2023లో దేశంలోని మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలను డాక్యుమెంట్‌ చేసే వాషింగ్టన్‌ డిసి ఆధారిత గ్రూప్‌ ఇండియా హేట్‌ ల్యాబ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న 668 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు నమోదయ్యాయి. 2023 ప్రథమార్థంలో 255 ఘటనలు జరిగాయి. ద్వితీయార్థంలో ఈ సంఖ్య 62 శాతం వృద్ధి చెంది, 413కి చేరుకుంది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే 75 శాతం

               498 ప్రసంగాలు అంటే దాదాపు 75 శాతం సంఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీలో (పోలీసులు, ప్రజా శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి) జరిగాయి. వాటిలో 36 శాతం అంటే 239 సంఘటనలు ముస్లింలపై ప్రత్యక్ష హింసాకాండను ప్రేరేపించేవిగా ఉన్నాయి. 420 అంటే 63 శాతం ప్రసంగాలు కుట్ర సిద్ధాంతాలు, ప్రధానంగా లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌, హలాల్‌ జీహాద్‌, జనాభా జీహాద్‌లకు సంబంధించినవిగా ఉన్నాయి. 169 ఘటనలు అంటే దాదాపు 25 శాతం ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్నవి.

ఎన్నికల సమయంలో గరిష్ఠ స్థాయికి విద్వేష ప్రసంగాలు

              రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆగస్టు నుండి నవంబర్‌ మధ్య కాలంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర (118), ఉత్తరప్రదేశ్‌ (104), మధ్యప్రదేశ్‌ (65), రాజస్థాన్‌ (64), హర్యానా (48), ఉత్తరాఖండ్‌ (41), కర్ణాటక (40), గుజరాత్‌ (31), ఛత్తీస్‌గఢ్‌ (21), బీహార్‌ (18) ద్వేషపూరిత ప్రసంగాలు చోటుచేసుకున్నాయి. ఈ రాష్ట్రాలు మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.

విద్వేష ప్రసంగాలతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో హింస…

             బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రమాదకరమైన ప్రసంగాల సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, హింసకు ప్రత్యక్ష పిలుపులతో కూడిన అన్ని సంఘటనలలో 78 శాతం బిజెపి పాలిత రాష్ట్రాలు, భూభాగాల్లోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన విద్వేషపూరిత ప్రసంగాల్లో 78 శాతం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.

ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా బిజెపియేతర రాష్ట్రాలలో ప్రవేశించడానికి బిజెపి ప్రయత్నిస్తుందని నివేదిక తెలిపింది.

సంఫ్‌ు పరివార్‌ అనుబంధ సంఘాలే కారణం

            విద్వేషపూరిత ప్రసంగ సంఘటనలలో 126 అంటే 32 శాతం విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి), బజరంగ్‌ దళ్‌ చేసినవే. ఎన్నికల ర్యాలీల సందర్భంలో 50 విద్వేషపూరిత ప్రసంగ కార్యక్రమాలను నిర్వహించడానికి బిజెపియే కారణమని నివేదిక పేర్కొంది. మొత్తంగా సంఫ్‌ు అనుబంధ సంఘాలు 307 విద్వేష పూరిత ప్రసంగాల సంఘటనలకు కారణమయ్యాయి. 2023లో మొత్తం ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలలో 46 శాతం జరిగాయి. ”గోరక్షా దళ్‌ వంటి గోవుల సంరక్షణ సంఘాలు క్రమం తప్పకుండా ద్వేషపూరిత ప్రసంగంలో పాల్గొంటున్నాయని తెలిపింది.

ఎనిమిది మంది అత్యంత విద్వేష ప్రసంగీకులు !

               146 ద్వేషపూరిత ప్రసంగాలు అంటే 22 శాతం సంఘటనలకు కేవలం ఐదుగురే కారణం. బిజెపి ఎమ్మెల్యేలు టి. రాజా సింగ్‌, నితీష్‌ రాణే, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్‌ (ఎహెచ్‌పి) చీఫ్‌ ప్రవీణ్‌ తొగాడియా, కాజల్‌ శింగల, సుదర్శన్‌ న్యూస్‌ యజమాని సురేష్‌ చవాన్కే, హిందూ మత పెద్దలు యతి నర్సింహానంద్‌, కాళీచరణ్‌ మహారాజ్‌, సాధ్వి సరస్వతి మిశ్రా చాలా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని నివేదిక పేర్కొంది.

ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచడానికి ఇజ్రాయెల్‌-గాజా యుద్ధాన్ని ఉపయోగించడం

”ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంపొందించడానికి” ఇజ్రాయెల్‌-గాజా యుద్ధాన్ని ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది. 2023 అక్టోబర్‌ 7- డిసెంబర్‌ 31 మధ్య జరిగిన 193 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలలో 41 (21 శాతం) యుద్ధాన్ని భారతీయ ముస్లింల పట్ల భయాన్ని, శత్రుత్వాన్ని పెంచడానికి ఉపయోగించారు. ద్వేషపూరిత ప్రసంగం, హింస మధ్య అవినాభావ సంబంధం ఉందని తెలిపింది. 2023 జూలైలో హర్యానాలోని నుహ్ లో, 2023 జూన్‌లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింస అందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ప్రజల మధ్య విభజన సృష్టించి బలపడేందుకు కొత్తగా కొన్ని సంఘాలు వస్తున్నాయని, ఇప్పటికే స్థాపించి ఉన్నవి కొత్త సంఘాలకు సహకరిస్తున్నాయని తెలిపింది. మైనారిటీ ద్వేషం ఎజెండాను ముందుకు తెస్తోంది.

➡️