పెరుగుతున్న తాగునీటి కష్టాలు

Apr 17,2024 21:52

అవసరం 42ఎంఎల్‌ డి … వస్తున్నది 27 ఎంఎల్‌ డి

ఐదేళ్లగా రోజు తప్పించి రోజు తాగునీటి సరఫరా

అంతకుముందు నాలుగు రోజులకోసారి

ప్రాజెక్టు నుంచి వచ్చే నీరే ఆధారం

కానరాని సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : వేసవి వచ్చిందంటే నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. నగర శివారు ప్రాంతాలు, విలీన పంచాయతీలకు కుళాయిలు ద్వారా రోజూ నీటి సరఫరా నేటికీ జరగడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాటర్‌ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా కాకపోవడంతో వేసవి వస్తే చాలు వాటర్‌ ప్లాంట్లు దగ్గర కొనుక్కోవాల్సిందే. వైసిపి హయాంలో గత ఐదేళ్లగా రోజు తప్పించి రోజు మాత్రమే తాగునీటి సరఫరా చేస్తుండగా, అంతకుముందు టిడిపి హయాంలో నాలుగురోజుల కొకసారి సరఫరా చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి మనిషి అవసరాల కోసం రోజుకు 130 లీటర్లు నీరు అవసరం. విజయనగరంలో 3లక్షలు దాటి జనాభా ఉన్నారు. ఒకరికి రోజుకు సరాసరి 150 లీటర్లు అవసరం కాగా, రెండు రోజులకు కలిపి 130 లీటర్లు నీరు కూడా అందడం లేదు. నగర పాలక సంస్థ ద్వారా నగర ప్రజలకు రోజుకి 27ఎంఎల్‌ డి నీరు మాత్రమే సరఫరా కావడంతో రోజు తప్పించి రోజు తాగునీటి సరఫరా చేయాల్సి వస్తోంది. అరకొర నీటితో నగర ప్రజలు సర్దుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. గత కొన్నాళ్లగా ఇదే పరిస్థితి ఉన్నా పాలకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో టిడిపి హయాంలో నాలుగైదు రోజులకొకసారి తాగునీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం రోజు తప్పించి రోజు రావడంతో ప్రజల్లో అంత వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. మరో వైపు రూ.200కే కుళాయి కనెక్షన్లు సుమారుగా 10వేలు ఇచ్చారు. నగరంలో కొత్తగా 11 నీటి ట్యాంకర్లు కట్టారు. కుళాయిలు ఇచ్చారు తప్ప నీటి సరఫరా మాత్రం జరగడం లేదు.విలీన ప్రాంతాలకు అందని తాగునీరునగర పాలక సంస్థలో విలీనమైన గాజులరేగ, జమ్ము నారాయణ పురం, కెఎల్‌ పురం, ధర్మపురి, అయ్యన్నపేట, అయ్యప్ప నగర్‌, రామకృష్ణ నగర్‌, గురజాడ అప్పారావు నగర్‌, ఎల్‌బిజి నగర్‌, కెఎల్‌ పురం రెవెన్యూ కాలనీ వంటి ప్రాంతాలకు నేటికీ ట్యాంకర్లు నీరే గతి. అది కూడాó వారంలో రెండుసార్లు మాత్రమే టాంకర్‌ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. విలీన పంచాయతీలు విలీనం జరిగి 7 ఏళ్లు దాటుతున్నా నేటికీ పైపు లైన్లు ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. అమత పథకం ద్వారా పైపు లైన్లు, రూ.200 కుళాయిలు ఇచ్చారు తప్ప నీరు మాత్రం నేటికీ సరఫరా కావడం లేదు. దీంతో టాంకర్ల ద్వారా మాత్రమే సరఫరా చేస్తున్నారు. వినాయక నగర్‌లో ఉన్న 50 కుటుంబాలకు ఒకటే బోరు, అది వేసవి కాబట్టి ఎండిపోయింది. రామకృష్ణనగర్‌లో నాలుగు బోర్లు ఉంటే మూడు ఎండిపోయాయి. మరొకటి రేపో మాపో ఎండిపోతుంది. నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీరు ఆ కాలనీ వాసులకు జీవనాధారంగా మారింది. ప్రాజెక్టుల నీటిపైన ఆధారం నగరానికి మంచి నీటిని అందించే తాటిపూడి, నెల్లిమర్ల నీటి పథకాలు ఎండిపోతుండటంతో ప్రతి ఏటా ఆండ్ర, తోటపల్లి నుంచి నీటిని తెప్పించుకుంటే తప్ప విజయనగరం పట్టణానికి నీరు ఉండడం లేదు. వేసవి కాలం వస్తే నీరు తెప్పించుకోవడం గత కొన్నేళ్లుగా జరుగుతుంది. నగర ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంలో టిడిపి, వైసిపి పాలకులు విఫలమయ్యారు. ఎన్నికల సమయం కావడంతో ఓట్లపై ప్రభావం పడకుండా ఫిబ్రవరిలోనే రెండు నెలలకు కావాల్సిన నీటిని ఆండ్ర ప్రాజెక్ట్‌ నుంచి ముందుగానే నెల్లిమర్ల స్టోరేజ్‌ పాయిుంట్‌ కు తరలించారు. మరో 40 రోజులు వరకు ఇబ్బంది ఉండదు. ఈ లోగా వర్షం పడితే పర్వాలేదు. లేదంటే మళ్లీ ఆండ్ర, లేదంటే తోటపల్లి ప్రాజెక్ట్‌ నీటిని తెప్పించుకోవాల్సిందే. లేకుంటే నీటి కష్టాలు తప్పవు.సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ గాలికిమరోవైపు వేసవి వస్తే నీటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా జనవరి నెలాఖరులో ఇంజినీరింగ్‌ అధికారులు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి దాని కోసం నిధులు కేటాయించే వారు. బోర్లు మరమ్మత్తులు, ట్యాంకర్లు పెంపు ,లీకేజీల అరికట్టేందుకు చర్యలు తీసుకునే వారు. ఏప్రిల్‌ నెల పూర్తి అవుతున్నా నేటికీ ఎటువంటి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

20 ఏళ్లుగా కుళాయికి నోచుకోలేదు

రామకృష్ణా నగర్‌ లో చుట్టూ కుళాయిలు ఉన్నాయి. కానీ మా కాలని ఏర్పడి 20 ఏళ్లయినా నేటికీ మున్సిపల్‌ కుళాయిలు లేవు. మేము సిపిఎం అధ్వర్యంలో పోరాడితే రెండురోజులకొకసారి మున్సిపాలిటీ వారు రెండు వాటర్‌ ట్యాంకులు పంపిస్తున్నారు. అవి ఏమూలకూ సరిపడటం లేదు, మాకు సాముహిక మరుగుదొడ్లు ఉన్నాయి కానీ నీరు లేక పోవడం తో వాటిని ఉపయోగించు కోలేక పోతున్నాం. 130 కుటుంబాలు ఉన్న కాలనీకి కుళాయి లు లేకపోవడం దారుణం. ఎం.జగదాంబ, రామకష్ణ నగర్‌

కొనుక్కుంటేనే మాకు నీరు

కాలనీ ఏర్పడినప్పటి (2009) నుంచి మాకు మున్సిపల్‌ కుళాయిలు లేవు. తాగునీరు కొనుక్కోవడం తప్ప మాకు మరో దిక్కు లేదు. ఎమ్మెల్యేను, అధికారులను నిలదీస్తే బోరు నీటినే ట్యాంకర్లలో నిల్వ చేసి పైప్‌ లైన్‌ ద్వారా వాడుకలకు పంపిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్నా కుళాయినీరు ఇవ్వకపోవడం అన్యాయం. వెంటనే మున్సిపల్‌ కుళాయిలు వేసి తాగునీటి కష్టాలు తీర్చాలి.

వి.లక్ష్మి, వై ఎస్‌ఆర్‌ కాలనీ, తోటపాలెం.

➡️