పచ్చదనమే మనకు రక్ష

Apr 13,2024 05:16 #edit page

ఆధునిక సాంకేతిక మోజులో అనాగరికంగా అడవులను నరుకుతున్నాం. అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదులుతున్నాం. వీటికి తోడు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తగ్గించే పద్ధతులు పాటించకపోవడం, చెట్లను పెంచే నైతిక బాధ్యతను విస్మరించడం వంటి వివిధ కారణాల వల్ల ప్రశాంతతను పంచాల్సిన ప్రకఅతి పర్యావరణం కలుషితమై నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేసింది. అందువల్లనే గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌, గ్లోబల్‌ వార్మింగ్‌, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో అనుకోని మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు లాంటివెన్నో నేడు మానవ మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. శాసిస్తున్నాయి. నేడు తాగడానికి మంచినీరు, శ్వాసించడానికి ఆక్సిజన్‌ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది మన ప్రపంచం. ఏం సాధించాం? ఎంత పురోగమించాం? ప్రకృతితో పోటీ పడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో ”ఆరడుగుల నేల”ను మరిచిపోతున్నాం. మనమంతా ఈ అవనిపై అతిథులమనే సత్యాన్ని గ్రహించలేపోతున్నాం. భవిష్యత్‌ తరాలకు బతుకునీయాలంటే, బతుకు వుండాలంటే ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, పౌరులు సామాజిక బాధ్యతగా, మానవతావాదంతో ప్రకృతితో స్నేహం చేస్తూ పచ్చదనాన్ని పరిమళింపచేయాలి. మనం నాటే చెట్ల ఎదుగుదలే మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. ప్రకృతి ప్రాణంతో వుంటేనే మనమంతా జీవంతో వుంటాము. లేదంటే ప్రకృతి విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం.

– పి. అరుణ్‌ కుమార్‌,
ఫిజిక్స్‌ రీసెర్చ్‌ స్కాలర్‌, పాలమూరు విశ్వవిద్యాలయం.

➡️