అన్ని తండాల్లో ప్రభుత్వ బడులు

Feb 16,2024 08:07 #Telangana CM, #tsrtc
Government schools in all Tandas

సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ సిఎం రేవంత్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాల్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తామని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బిటి రోడ్లు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్‌, తాగునీరు, వైద్యం.. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వసతి గృహాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందనీ, యువత అంతా సంత్‌ సేవాలాల్‌ మార్గంలో నడవాలని కోరారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో గురువారం నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. 1976లో బంజారాలను ఎస్‌టి జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారని గుర్తు చేశారు. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని ప్రజలందరూ నినదించారు కాబట్టే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. సేవాలాల్‌ జయంతిని ఆప్షనల్‌ హాలీడేగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు రూ. రెండు కోటు కేటాయించామనీ, దీనికి సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

➡️