గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో దొంగను పట్టుకున్న ఓ కుర్రాడు

Feb 6,2024 16:20 #Google Maps, #helps, #tamilnadu

ఇంటర్నెట్‌డెస్క్‌ : గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో తెలియని ప్రదేశానికి వెళ్లడం సహజం. కానీ ఓ కుర్రాడు తన తండ్రి వద్ద ఉన్న ఫోన్‌ని, బ్యాగ్‌ని కొట్టేసిన దొంగను పట్టుకున్నాడు. తాను ఏవిధంగా దొంగను పట్టుకున్నది ఆ కుర్రాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దొంగను పట్టుకున్న యువకుడి పేరు పి. రాజ్‌ భగత్‌. ‘మా నాన్న తిరుచ్చికి వెళ్లడానికి తమిళనాడులోని నాగర్‌ కోయిల్‌ జంక్షన్‌ నుంచి తెల్లవారుజామున 1.43 గంటల సమయంలో నాగర్‌కోయిల్‌- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. ఆ సమయంలో ఆ రైలులో ప్రయాణీకులు ఎక్కువమంది లేరు. అదే సమయంలో తిరునెల్వేలి జంక్షన్‌లో ఓ వ్యక్తి ఆ రైలు ఎక్కాడు. స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న మా నాన్న దగ్గర నుంచి ఫోన్‌, బ్యాగ్‌ని కొట్టేసి అతను రైలు దిగాడు. తీరా మానాన్న తన ఫోన్‌ బ్యాగ్‌ పోయిందని తెలుసుకున్నాక.. తెల్లవారుజామున 3.51 గంటల సమయంలో ఆ రైలులో తోటి ప్రయాణికుని దగ్గర నుంచి నాకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. నేను వెంటనే మా నాన్న ఫోన్‌ని ట్రాక్‌ చేశాను. ఆ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కాలేదు. దీంతో నా పని సులువైంది. ఆ ఫోన్‌ని ట్రాక్‌ చేస్తూనే ఉన్నాను. ఆ ఫోన్‌ అతని వద్దే తిరునల్వేలిలోని మేలపాళయం దగ్గర ఉన్నట్లు గూగుల్‌ మ్యాప్‌లో కనిపించింది. మళ్లీ ఆ దొంగ వేరే ట్రైన్‌లో నాగర్‌కోయిల్‌కి వస్తున్నట్లు అర్థమైంది. ఆ సమయంలో నేను నా స్నేహితునితో కలిసి పోలిసుల దగ్గరకు వెళ్లి.. దొంగను పట్టుకునేందుకు వారి సహాయాన్ని కోరాను. పోలీసులు కూడా అందుకు సహకరించారు. ఆ దొంగ కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో నాగర్‌కోయిల్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. ఆ సయమంలో స్టేషన్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. నేను అతన్ని పట్టుకునేలోపే మెయిన్‌ గేట్‌ నుంచి రైల్వేస్టేషన్‌ దగ్గరలోని అన్నా బస్‌స్టేషన్‌కి వెళ్లాడు. నేను, నా ఫ్రెండ్‌ బైక్‌పై అన్నా బస్‌స్టేషన్‌కి వెళ్లాము. ఆ దొంగ నా వెనకే నిలబడ్డాడు. గూగుల్‌ మ్యాప్‌లో రెండు మీటర్ల దూరమే అని చూపిస్తోంది. మళ్లీ ఆ బస్‌స్టేషన్‌లోని మనుషులవైపు పరిశీలనగా చూశాను. ఓ వ్యక్తి చేతిలో నల్ల బ్యాగ్‌ ఉంది. ఆ బ్యాగ్‌పై సిఐటియు లోగో ఉంది. అది మానాన్న బ్యాగ్‌ అని నేను కనిపెట్టాను. వెంటనే ఆ దొంగ దగ్గరికి వెళ్లి ఫోన్‌ బ్యాగ్‌ ఇవ్వమంటే.. బుకాయించాడు. అయితే బస్‌స్టేషన్‌లోని ప్రయాణీకులు కూడా ఆ దొంగని తిట్టి అతని దగ్గర ఉన్న మా నాన్న ఫోన్‌ని, బ్యాగ్‌ని నాకిచ్చారు. ఈ ఘటన ఫిబ్రవరి 4న జరిగింది. రాజు ఈ ఘటనకు సంబంధించి ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయి ఉంటే.. ఆ ఫోన్‌ దొరికేది కాదేమో.. అని ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించాడు. మరొక నెటిజన్‌ ‘నా ఫోన్‌ కూడా పోయింది. పోలీసులకి కంప్లైట్‌ ఇచ్చాను. ముంబై పోలీసులు నా ఫోన్‌ని ట్రాక్‌ చేసి కనిపెట్టారు.’ అని వ్యాఖ్యానించారు.

➡️