బంగారం ధరలు భగభగ…మరో రూ.450 పెరుగుదల

Dec 28,2023 21:05 #Business

న్యూఢిల్లీ : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా ధరలు పెరుగుతూ.. నూతన రికార్డ్‌ స్థాయికి ఎగిశాయి. గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.450 పెరిగి రూ.64,300కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతోనే ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇంతక్రితం డిసెంబర్‌ 4న బంగారం ధర రూ.64,300గా నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. బుధవారం సెషన్‌లో 63,850 వద్ద ముగిసింది.22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.58,900గా నమోదయ్యింది. తాజాగా కిలో వెండిపై రూ.400 తగ్గి రూ.79,500గా పలికింది. ఇంతక్రితం సెషన్‌లో ఈ లోహ ధర రూ.79,100గా ఉంది. అంతర్జాతీయంగా ఒక్క ఔన్స్‌ బంగారం, వెండి ధరలు వరుసగా 2,080 డాలర్లు, 24.31 డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ”అమెరికా ట్రెజరీలో పసిడి ధరలు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. వచ్చే దఫా భేటీలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాల్లో ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు డాలర్‌కు, అమెరికా ట్రెజరీ బాండ్లకు విలువ తగ్గడంతో బంగారం ధరల పెరుగుతున్నాయి.” అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

➡️