1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను అధిగమించిన గ్లోబల్‌ వార్మింగ్‌

  •  ప్రప్రధమంగా ఏడాది పొడవునా నమోదైన ఇదే పరిస్థితి

బ్రస్సెల్స్‌ : మొట్టమొదటిసారిగా, గ్లోబల్‌ వార్మింగ్‌ ఏడాది పొడవునా 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటిపోయిందని వాతావరణ నిపుణులు శుక్రవారం తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి అధ్వాన్న ప్రభావాలను నివారించాలంటే ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయాల్సిన అవసరం వుందంటూ శాస్త్రవేత్తలు ఎన్నాళ్లనుండో చెబుతున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను దాటి 2 డిగ్రీలకు చేరుకుంటే మరింత ఉధృతంగా వడగాలులు, సముద్ర మట్టాలు పెరగడం, వన్యప్రాణి నష్టం వంటి ముప్పులు అధికమవుతాయని 2018లో విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. యురోపియన్‌ యూనియన్‌కి చెందిన కొపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ తాజాగా కొత్త డేటా వెలువరించింది. గ్లోబల్‌ వార్మింగ్‌ను కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి వుంటామంటూ ప్రపంచ నేతలు హామీ ఇచ్చిన 2015 నాటి పారిస్‌ ఒప్పంద ఉల్లంఘన గురించి ఆ డేటా మాట్లాడలేదు. కానీ సుదీర్ఘకాలంలో ఇది ప్రపంచాన్ని మరింత సన్నిహితం చేస్తుందని వ్యాఖ్యానించింది. భూగోళం మరింత వేడెక్కకుండా నివారించాలంటే కాలుష్యకారక వాయువులను సత్వరం తగ్గించడమొక్కటే ఏకైక మార్గమని కొపర్నికస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సమంతా బర్గెస్‌ తెలిపారు. వార్షిక సగటు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ అధిగమించడం ఇక్కడ ప్రధానమైన అంశమని రాయల్‌ మెటీరియోలాజికల్‌ సొసైటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొఫెసర్‌ లిజ్‌ బెంట్లీ పేర్కొన్నారు. ‘తప్పుడు దిశగా ఇది మరొక అడుగు. మనమేం చేయాలనేది మనం తెలుసుకుని వుండాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ప్రపంచ మెటీరియోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ సాలో కూడా ఏకీభవించారు. ఈ ప్రభావంతో ఉత్తర అమెరికా, యూరప్‌ల్లో మరింతగా శీతల తుపానుల ముప్పు పెరుగుతుందన్నారు. ‘ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తోందో ఆ ధోరణి చాలా స్పష్టంగా వుంది. ఆందోళనకరంగా వుంది” అని ఆమె అన్నారు. వెంటనే ప్రపంచ దేశాలు సత్వరం స్పందించాల్సిన ఆవశ్యకత వుందన్నారు. మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, మన కామన్‌సెన్స్‌ సూచిస్తున్నా వాటిని కాదని ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని మనం వెనుకడుగు వేస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు.

➡️