400 స్థానాలివ్వండి..

రాజ్యాంగాన్ని మార్చేస్తాం
బిజెపి ఎంపి అనంత కుమార్‌ వ్యాఖ్యలు
తీవ్రంగా ఖండించిన సిపిఎం
బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల్లో తమకు 400 స్థానాలు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని తిరగరాస్తామని కర్ణాటకకు చెందిన బిజెపి ఎంపి అనంత కుమార్‌ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న హిందూవులకు సముచిత ప్రాధాన్యాత ఇవ్వలేదని, అందువల్ల ఈ రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందువల్ల బిజెపికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని కోరారు. హిందువులకు అనుకూలమైన రీతిలో రాజ్యాంగాన్ని బిజెపి మాత్రమే మార్చగలదని చెప్పుకొచ్చారు. ఆరేళ్ల కిందట కూడా అనంత కుమార్‌ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేయాలని, లౌకికవాద పదాన్ని తొలగించాలని వాగారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో హెగ్డే వివాదస్పద వ్యక్తిగా మారారు. ఆయన వ్యాఖ్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. హెగ్డే వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య సూత్రాలకే విఘాతమని ఆందోళన వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మరింత బలోపేతంగా పోరాడాల్సివన అవశ్యకతను ఈ సందర్భంగా సిపిఎం నొక్కి చెప్పింది. రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని సిపిఎం స్పష్టం చేసింది. ‘ప్రజాస్వామం పట్ల మా నిబద్ధత తిరుగులేనిది. రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదురు తిరిగి పోరాడతాం’ అని సామాజిక మాధ్యమాల్లో సిపిఎం పునరుద్ఘాటించింది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగానికి బిజెపి వ్యతిరేకమనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ తెలిపారు.

➡️