ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించకపోవడం అన్యాయం

girijana leader killo suredra on dsc

ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర

ప్రజాశక్తి – అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటన చేయకపోవడం అన్యాయమని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. ప్రభుత్వ తీరును తమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ఆదివాసీ గిరిజన భవనంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే గిరిజనులకు ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని నాడు జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పటి వరకూ ఆ విషయాన్నే పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 6100 పోస్టుల డిఎస్‌సి భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే వాటన్నింటినీ భర్తీ చేయకుండా తూతూ మంత్రంగా పోస్టులు ప్రకటించడంపై మండిపడ్డారు. స్పెషల్‌ డిఎస్‌సి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదివాసీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాల్లో వంద శాతం ఉద్యోగావవకాశాలు కల్పించే జిఒ నెంబర్‌ 3 రద్దు తర్వాత స్పెషల్‌ డిఎస్‌సి ఊసే లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని ఆదివాసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, మండల అధ్యక్షులు జి బుజ్జిబాబు, నాయకులు బి దశరథ్‌ పాల్గొన్నారు.

➡️