మెగా గ్యాస్‌ పైప్‌ లీక్‌

Apr 15,2024 14:30 #gas
  • భారీగా ఎగసిపడిన మంటలు

ప్రజాశక్తి – ముదినేపల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజ- పెనుమల్లి గ్రామల మధ్య గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఘటనాస్థలిని పరిశీలించిన తహశీల్దార్‌ కుమారి తెలిపిన వివరాల మేరకు.. మెగా గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థకు చెందిన గ్యాస్‌ పైప్‌ సోమవారం లీకైంది.
సమీపంలోని చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తాటిచెట్లు కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెవెన్యూ, గ్యాస్‌ కంపెనీ ప్రతినిధులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బంటుమిల్లి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పదిమీటర్ల మేర గ్యాస్‌పైపుకు నష్టం వాటిల్లింది. చుట్టుపక్కల ఎటువంటి నివాస గృహాలు లేనందున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తహశీల్దార్‌ తెలిపారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసి నివేదికను ఉన్నత అధికారులకు పంపనున్నట్లు తెలిపారు.

➡️