రాజ్యసభ ఎన్నికల భయంతోనే స్పీకర్‌ చర్య

– మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారు

– మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే దానిని ఇప్పుడు స్పీకర్‌ ఆమోదించడమేమిటని టిడిపి మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖలోని టిడిపి కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన ఆశయం కోసం 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. స్వయంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించానని తెలిపారు. ఆముదాలవలస వెళ్లి స్పీకర్‌ గృహంలో కలిసి రాజీనామా ఆమోదించాలని కోరానని చెప్పారు. ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించలేదని తెలిపారు. నా రాజీనామా లేఖను కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచారన్నారు. ఇప్పుడు కుట్ర కోణంతో ఆమోదించారని ఆరోపించారు. రాజీనామా ఆమోదించే ముందు తనను స్పీకర్‌ సంప్రదించాల్సి ఉన్నా ఆలా చేయలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమంపై సిఎం జగన్‌ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో తన రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్‌ సమావేశాలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ఎంపిలు ఫ్లకార్డులు ప్రదర్శించగలరా? అని ప్రశ్నించారు. సమావేశంలో టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జి పాల్గొన్నారు.

➡️