నత్తనడకన గన్నవరం విమానాశ్రయం పనులు

Apr 11,2024 03:31 #gannavaram, #gannavaram airport
  •  నూతన టెర్మినల్‌ నిర్మాణంలో జాప్యం

ప్రజాశక్తి – గన్నవరం (విజయవాడ) : విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని అనేకసార్లు అధికారులు, కాంట్రాక్టర్లు ప్రకటించారు. కానీ, ఇంతవరకు 63 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మిగిలిన పనులు ఇంకో రెండేళ్లకు కూడా పూర్తవుతాయో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొత్త టెర్నినల్‌ నుండి జాతీయ రహదారి వరకు నూతన సిమెంట్‌ రోడ్డు పనులను చేస్తున్నారు. విమానాశ్రయం విస్తరణ ప్రాజెక్ట్‌లో పూర్తయిన భాగాల్లో ఆప్రాన్‌, నాలుగు-లేన్ల అప్రోచ్‌ రోడ్‌, రన్‌వే విస్తరణ పనులు ఉన్నాయి. ఈ పనులు 3,360 మీటర్ల మేర జరిగాయి. ఈ పనులు పెద్ద విమానాలను హ్యాండిల్‌ చేయగలవు. 2022 ఆగస్టు నాటికి కొత్త టెర్మినల్‌ను పూర్తి చేయాలని భావించినా కోవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది. మొత్తం పనులు 2025 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.


ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విమానాశ్రయం అభివద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శ ఉంది. బిజెపి ప్రభుత్వం ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఇచ్చినా ఆ స్థాయిలో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడంలో విఫలమైంది. గన్నవరం విమానాశ్రయం రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్మీ బేస్‌గా పనిచేసింది. ఆ తర్వాత దీనిని పౌర విమానాశ్రయంగా మార్పు చేశారు. 2003 సెప్టెంబరులో ఎయిర్‌ డెక్కన్‌ హైదరాబాద్‌ – విజయవాడ మధ్య రోజువారీ సర్వీసును ప్రవేశపెట్టింది. 2011 వరకు ఈ విమానాశ్రయానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా రోజుకు నాలుగు విమానాలు మాత్రమే నడిచేవి. 2011లో ఫ్లాగ్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఇండియా, ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాశ్రయానికి నేరుగా విమానాలను ప్రవేశపెట్టాయి. 2013 అక్టోబర్లో ఎయిర్‌ కోస్టా ప్రాంతీయ విమానయాన సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. విజయవాడ కేంద్రంగా పని చేసిన ఈ సంస్థ ఆ తర్వాత తన సేవలను నిలిపివేసింది. ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా 2015 అక్టోబర్‌లో కొత్త తాత్కాలిక టెర్మినల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. ఏడాదికి రెండు మిలియన్ల మంది ప్రయాణీకుల రద్దీని తట్టుకునే విధంగా 2017 జనవరి 12న నూతన టెర్మినల్‌కు ప్రణాళిక రూపొందించారు. పెద్ద ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణం జరిగే వరకు వచ్చే నాలుగైదేళ్లలో ప్రయాణీకుల అవసరాల కోసం దేశీయ కార్యకలాపాలను తాత్కాలిక టెర్మినల్‌కు మార్చారు. తరువాత, పాత విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని మూసివేశారు. నూతన టెర్మినల్‌ను అంతర్జాతీయ సేవల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. నూతన టెర్మినల్‌ పనులు పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని సర్వీసులు రావడానికి అవకాశం ఉంటుంది.

➡️