గాంధీ రాముడు రామ మందిరంలో లేడు

Feb 24,2024 07:13 #Editorial

అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు నివసిస్తున్న, ఒక శతాబ్దానికి పైగా హిందూ ముస్లిం ఘర్షణలు ఉన్న భారతదేశంలో రాముడిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా, అన్ని సమస్యలకు రామనామమే పరిష్కారమనే దానిని సమర్ధించడంలో ఉన్న లోతైన, తీవ్రమైన చిక్కులు గాంధీకి తెలుసు. దురుద్దేశంతోనే బ్రిటీష్‌ వారు భేదాభిప్రాయాలను సృష్టించి చీలికల్ని తీవ్రం చేశారు. దాని కారణంగా ఆయన ఎప్పుడూ కూడా దేవాలయాలను, మసీదులను, చర్చ్‌ లను సందర్శించకుండా చాలా జాగ్రత్త వహించాడు.

గాంధీజీ 1948లో ‘హే రాం’ అంటూ తుది శ్వాస విడిచాడు. రాముని ప్రభావం మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ మీద తన బాల్యం నుండి ఉంది. అయితే ఆయన ఉదహరించే రామ నామం దేవాలయంలో కనిపించే విగ్రహం కాదు. లేదా ఒక ఆచారంగా పద్యాన్ని కంఠస్థం చేయడం అంతకన్నా కాదు. దానికి బదులుగా అది హృదయంలో చాలా లోతైన విషయం.

రామ రాజ్యం – కొత్త అర్థం

                  రాజకీయాల ప్రక్షాళన, వ్యావహారిక మత సంస్కరణ కోసం పని చేయాలని గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన ప్రసంగాలలో రాముడికి, రామ నామం, రామ రాజ్యానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ప్రార్థన రూపంలో తన హృదయాంతరాల్లో నుండి రామ నామాన్ని ఆలపించడం ద్వారానే ఆయన నిరంతర స్వీయ ప్రక్షాళనా ప్రయాణం సాగింది.

మార్చి 18, 1933 లో ‘హరిజన్‌’ పత్రికలో ప్రసిద్ధి చెందిన విశ్వాసాల్ని, ఆచారాల్ని విమర్శించే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు లేవనెత్తిన మూడు ప్రశ్నలను ఉదహరించి, వాటికి సమాధానాలు చెప్పాడు. మొదటిది: ”శ్రీరామచంద్రుడ్ని అనుసరిస్తున్న ఓ హిందువు కూడా దేవాలయానికి వెళ్ళి, ఆయన విగ్రహాన్ని చూడాల్సిన అవసరముందా? కార్యం కంటే దర్శనం మెరుగైందా?”. రెండు: మనం ఒక వ్యక్తి ముందు తల దించినా లేదా చేతులు కట్టుకొని ఉన్నా, అతడు తిరిగి జవాబిస్తాడు. కానీ విగ్రహం అలా చెయ్యదు. అలాంటప్పుడు, మనం ఈ పని చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఉత్తరాలకు సమాధానం ఇవ్వని వ్యక్తికి ఉత్తరాలు రాయడం వల్ల ప్రయోజనం ఏమిటి?”. మూడు: ”హిందువులు ఆరాధించే ఓ వ్యక్తి తన జీవిత కాలంలో కొన్ని తప్పులు చేసి ఉండి ఉండవచ్చు. ఆ తప్పుల్ని అనుకరించడం ఆరాధకునికి ప్రమాదం కాదా? అతడు ఆ చిత్రాన్ని పూజిస్తే ఆ తప్పులను అనుకరించడా?

”తనలో ఉండాల్సిన రాముడ్ని విగ్రహంలో ఉండాలని కోరుకోవడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డాడు. అయినా రాముడిని దేవాలయంలో చూసే ”సామాన్యమైన విశ్వాసానికి” మాత్రం గాంధీ భంగం కలిగించడు. గాంధీ ప్రతిస్పందన ఇలా ఉంది: ”రామచంద్రుని విగ్రహాన్ని పూజించడానికి ఏ హిందువూ కూడా దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఇది ఆలయంలో రాముని విగ్రహాన్ని చూడకుండా తన రాముడ్ని దర్శించుకోలేని వ్యక్తి కోసమే. ఇది దురదష్టం కావచ్చు, అతని రాముడు ఎక్కడా లేని విధంగా ఆ ఆలయంలోనే ఉంటాడనేది వాస్తవం. నేను ఆ సామాన్యమైన విశ్వాసానికి భంగం కలిగించను.

” అయితే కార్యం లేదా చర్య, దర్శనం కంటే చాలా ముఖ్యమైనది. మౌనంగా చేసే పూజ దేవునికి ఉత్తరం వంటిది. దేవుడు దేవాలయంలో మాత్రమే ఉండడు. ఆయన ఆలయం, మసీదు, చర్చ్‌ల మధ్య ఎలాంటి భేదాన్ని చూపించలేదని గాంధీ పేర్కొన్నాడు.

మూడవ ప్రశ్నపై ఆయన ఇలా రాశాడు: ”నా హేతుబద్ధత, హృదయం చాలా కాలం కిందే దేవుని అత్యున్నతమైన లక్షణాన్ని, పేరును ‘సత్యం’ అని నిరూపించినప్పటికీ, నేను సత్యాన్ని రాముని పేరుతో గుర్తిస్తాను. నా విచారణ జరిగే చీకటి సమయంలో ఆ ఒక్క పేరే నన్ను రక్షించింది, ఇప్పటికీ రక్షిస్తూనే ఉంది.” గాంధీ అన్ని ప్రసంగాలు, వ్యాసాలు, ఉత్తరాలలో రాముడు, రామ నామం, తులసీదాస్‌ రామచరితమానస్‌ (రామాయణం)లు వందల సార్లు ఉదహరించబడి, వ్యాఖ్యానించబడినాయి.

గాంధీ రాముడు

                    గాంధీ రాముడు ఎవరు? ఆయన ఒక హిందూ దేవుడా? ఆయన దీనిపై అనేకసార్లు స్పష్టత ఇచ్చాడు. 1946 ఏప్రిల్‌ 4న ఢిల్లీ లోని బిర్లా హౌస్‌లో తన ప్రార్థనా సమావేశంలో గాంధీ ఈ విధంగా మాట్లాడారు: ”రాముడు లేదా రామ నామ జపం హిందువులకు మాత్రమే ఉద్దేశించినదని ఎవరైనా అంటే నాలో నేను నవ్వుకుంటాను. అలాంటప్పుడు ముస్లింలు దానిలో ఎలా పాల్గొంటారు? ముస్లింలకు ఒక దేవుడు, హిందువులకు, పార్శీలకు, క్రైస్తవులకు వేరొక దేవుడు ఉంటాడా? లేదు, సర్వశక్తియుతుడు, సర్వవ్యాపియైన దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయనకు రకరకాల పేర్లున్నాయి. మనకు బాగా తెలిసిన పేరుతో మనం ఆయనను గుర్తుంచుకుంటాం. నా రాముడు, మన ప్రార్థనల రాముడు అంటే అయోధ్య రాజు దశరథుని కుమారుడైన చారిత్రక రాముడు కాదు. అతడు శాశ్వతమైన వాడు, ఇంతవరకు పుట్టనివాడు, రెండవవాడు లేనివాడు. నేను అతనిని మాత్రమే ప్రార్థిస్తాను, అతని సహాయాన్ని మాత్రమే నేను కోరతాను, మీరు కూడా అలానే చెయ్యాలి. ఆయన అందరికీ సమానంగా చెందినవాడు. అందువలన, ఒక ముస్లిం లేదా ఎవరైనా అతని పేరు తీసుకోవడానికి ఎందుకు ఆక్షేపిస్తున్నారో నాకెలాంటి కారణం కనిపించడం లేదు. అయితే దేవుడిని రామ నామంగా గుర్తించేందుకు ఆయన కట్టుబడి లేడు. శబ్ద సామరస్యానికి హాని చేయకుండా ఉండడానికి అతడు తనలో తాను అల్లా లేదా ఖుదా అని ఉచ్ఛరించవచ్చు.

అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు నివసిస్తున్న, ఒక శతాబ్దానికి పైగా హిందూ ముస్లిం ఘర్షణలు ఉన్న భారతదేశంలో రాముడిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా, అన్ని సమస్యలకు రామనామమే పరిష్కారమనే దానిని సమర్ధించడంలో ఉన్న లోతైన, తీవ్రమైన చిక్కులు గాంధీకి తెలుసు. దురుద్దేశంతోనే బ్రిటీష్‌ వారు భేదాభిప్రాయాలను సృష్టించి చీలికల్ని తీవ్రం చేశారు. దాని కారణంగా ఆయన ఎప్పుడూ కూడా దేవాలయాలను, మసీదులను, చర్చ్‌ లను సందర్శించకుండా చాలా జాగ్రత్త వహించాడు. అయితే ఆయన పుట్టిన హిందూ మతానికి సంబంధించిన, హిందూ సాంప్రదాయాల చిహ్నాలను మాత్రం ఉపయోగించాడు.

భోపాల్‌లో 1929లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఇలా చెప్పాడు: ”నేను రామ రాజ్యం అనే పదాన్ని ఉపయోగించడంతో నన్ను అపార్థం చేసుకున్నందుకు నేను నా ముస్లిం మిత్రులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. రామ రాజ్యం అంటే నా ఉద్దేశ్యంలో హిందూ రాజ్యం అని కాదు. నా ఉద్దేశ్యంలో రామ రాజ్యం అంటే దైవ రాజ్యం, దేవుని సామ్రాజ్యం. నా దృష్టిలో రాముడు, రహీం ఒకే దేవుని కింద లెక్క. సత్యం, ధర్మం అనే ఏకైక దేవుడు తప్ప మరే ఇతర దేవుడ్ని నేను గుర్తించను.” ఇది రాజకీయాల్లో, ప్రజా జీవితంలో గాంధీ మతం. గాంధీ తరువాత ఇలా రాశాడు: ”నా ఊహలో ఉన్న రాముడు ఈ భూమి మీద జీవించాడో లేదో. రామ రాజ్యం యొక్క ప్రాచీనమైన ఆదర్శం మాత్రం ఎలాంటి సందేహం లేకుండా నిజమైన ప్రజాస్వామ్యంలో ఒకటి. దీనిలో చాలా పేదవాడైన పౌరుడు విస్తృతమైన, ఖరీదైన ప్రక్రియలు లేకుండా న్యాయాన్ని కచ్చితంగా పొందగలడు. ఆఖరికి కుక్కకు కూడా రామ రాజ్యంలో న్యాయం జరిగినట్లు కవి వర్ణించాడు.”

నేటి పరిస్థితి

                  నేడున్న పరిస్థితుల్లో గాంధీ రాముడు, రామ నామం, రామ రాజ్యంను నమోదు చేయడం చాలా ముఖ్యం. మత రాజకీయీకరణ అనేది, గాంధీ దేనినైతే సమర్థించాడో, దేనికోసం నిలబడ్డాడో దానికి వ్యతిరేకం. ఇది దేశానికి అంత మంచిది కాదు. భారతదేశం బహుళ మతాలు, బహుళ సంస్కృతులు ఉన్న సమాజం. నేటి ప్రధానమంత్రికి తన మతంపై, విశ్వాసం, అంకితభావం ఉన్నప్పటికీ ఒకే మతం పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడం అనేది ఆరోగ్యకరమైన సంకేతాలను ఇవ్వదు.

('ద హిందూ' సౌజన్యంతో)సుదర్శన్‌ అయ్యంగార్‌
(‘ద హిందూ’ సౌజన్యంతో)సుదర్శన్‌ అయ్యంగార్‌
➡️