విశాఖలో జివిఎల్‌ ‘సంక్రాంతి’ దందా!

Jan 15,2024 11:27 #danda, #Sankranti festival, #Visakha
  • ప్రభుత్వ రంగ సంస్థలపై ‘చందాల’ భారం
  • ఎస్‌బిఐ లక్షలాది రూపాయలు స్పాన్సర్‌ షిప్‌ ?
  • కేంద్రం అండ చూసేనా ?

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఆయన ఇక్కడ నుంచి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏ సభకూ విశాఖ నుంచి గెలవలేదు. కనీసం నామినేట్‌ చేయబడలేదు. బిజెపి నాయకునిగా విశాఖ కేంద్రంగా గడిచిన రెండేళ్ల నుంచీ హడావుడి చేస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆయనే జివిఎల్‌ నరసింహారావు. విశాఖపట్నంపై దృష్టి సారించి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ విశాఖ పార్లమెంట్‌ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. సంక్రాంతి మహా సంబరాల పేరుతో విశాఖలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.కోట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో భేటీ ఇందుకేనా ?

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో పరిశ్రమల అధిపతులతో నిత్యం సమావేశాలు, భేటీలు నిర్వహిస్తూ ‘కేంద్రం తనను ఎపికి దూతగా పంపింది’ అంటూ జివిఎల్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు సుమారు రెండేళ్లుగా కేంద్రంపై పోరాడుతుంటే ఆ ఉద్యమంపై నీరుజల్లేందుకు ఆయన తప్పుడు ప్రకటనలకు పాల్పడుతున్నారు. ‘ప్రయివేటీకరణ ఆగిపోయిందని ఒకసారి, కేంద్ర స్టీల్‌ మంత్రితో చర్చించానని, అమిత్‌ షా హామీ ఇచ్చారని మరోసారి ప్రకటనలు ఇస్తూ, తప్పుదారి పట్టించే యత్నం చేశారు. చైతన్యవంతమైన స్టీల్‌ కార్మికవర్గం జివిఎల్‌ ఎత్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజలు, కార్మికుల ముందు ఉంచుతోంది. కేంద్రంలోని బిజెపి, హోంమంత్రి అమిత్‌ షా పేరు చెప్పుకుంటూ జివిఎల్‌ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన ‘సంక్రాంతి’ సంబరాలు నిర్వహించడం పెద్ద చర్చనీయాంశమైంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ద్వారా లక్షలాది రూపాయలు స్పాన్సర్‌ షిప్‌ చేయించుకున్నట్లు సమాచారం. ఎస్‌బిఐపైనే కాకుండా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలపైనా ఒత్తిడి తెచ్చి లక్షలాది రూపాయలు చందాల రూపంలో వసూలు చేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో హెచ్‌పిసిఎల్‌, హిందుస్థాన్‌ షిప్‌యార్డు, నేవల్‌ కమాండ్‌, స్టీల్‌ప్లాంట్‌, ఎన్‌టిపిసి సిఎమ్‌డిలు, ఎమ్‌డిలతో జివిఎల్‌ పలు దఫాలు చర్చలు జరపడంపైనా విమర్శలు వస్తున్నాయి.

12 నుంచి 15 వరకూ మహా సంక్రాంతి సంబరాలు

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి సంబరాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలపై ఆర్థిక భారాన్ని రుద్దినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీచ్‌ రోడ్డులో ఒక ఇంట్లో జివిఎల్‌ ఉంటూ పిఆర్‌ఒల వ్యవస్థ ద్వారా పలు కార్యకలాపాలు చేపడుతున్నారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానానికి బిజెపి తరఫున బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే తనకు తానే ప్రకటించుకున్నారు. అయితే, పలువురు బిజెపి సీనియర్‌ నాయకులు జివిఎల్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

సెట్టింగులకు రూ.60 లక్షలు పైనే…

సంక్రాంతి సంబరాలకు అయ్యే సెట్టింగుల ఖర్చే రూ.60 లక్షల మేరకు ఉంటుందని తెలుస్తోంది. రోజూ కల్చరల్‌ కార్యక్రమాల పేర జబర్దస్త్‌ టీముల సందడి, పల్సర్‌ బైక్‌ ఝాన్సీ ఆటలు, సినీ తారలను 14న తీసుకొచ్చి ఆటా పాట ఏర్పాటు చేశారు. వీటి ఖర్చంతా ఎస్‌బిఐపై రుద్దినట్లు సమాచారం.

జివిఎల్‌ అక్రమ చర్యలకు సిపిఎం ఖండన

ఎస్‌బిఐ సొమ్ముతో బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు సంక్రాంతి సంబరాలు నిర్వహించడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తీవ్రంగా ఖండించారు. దీనిపై ఎస్‌బిఐ అధికారులు తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం ఎస్‌బిఐ సిఎస్‌ఆర్‌ నిధులను సంక్రాంతి సంబరాల పేరుతో జివిఎల్‌ దుర్వినియోగం చేశారని విమర్శించారు.

➡️